ఇళ్లు ఖాళీ చేయాలని కోర్టు తీర్పు
మాస్టర్ ప్లాన్ ప్యాకేజీ ఇవ్వాలని స్థానికుల వేడుకోలు
కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన
తిరుమల: తరతరాలుగా శ్రీవేంకటేశ్వర స్వామివారిని నమ్ముకుని జీవిస్తున్న తిరుమల వాసులకు మరో చేదు కబురు అందింది. రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఎదురుగా ఉన్న 64 ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని సోమవారం తిరుపతి కోర్టు తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఆరునెలల్లోగా వారు ఇళ్లను ఖాళీ చేయాల్సి ఉంది. టీటీడీ తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 1973లో రెండో ఘాట్‌రోడ్డు ఏర్పడ్డాక తిరుమలకు భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. భక్తులకు అనుగుణంగా టీటీడీ కూడా సౌకర్యాలు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధుల చుట్టూ ఉండే స్థానిక నివాసాలను తొలగించాలని నిర్ణయించారు. తొలుత దక్షిణ మాడ వీధిలో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని దేవస్థానం అధికారులు ప్రతిపాదించారు.
ఇందుకు అనుగుణంగా 1974లో ఆలయ దక్షిణ మాడ వీధిలో హథీరాం మఠం ఆనుకుని ఉండే పూటకూళ్లమిట్ట, గజేంద్రమోక్షం ఇటుఇటుగా ఉండే కొన్ని గుడిసెలు, మరికొన్ని పక్కా ఇళ్లను తొలగించారు.
వారికి రిహాబిలిటేషన్ సెంటర్ పేరుతో సుమారు 64 ఇళ్లను టీటీడీ అధికారికంగా నిర్మించించి కేటాయించింది. 1999 నాటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఆ ఇళ్లను ఖాళీ చేయాలని ఇక్కడి స్థానికులకు టీటీడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై స్థానికులు వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. 25 ఏళ్ల తర్వాత ఇళ్లపై పూర్తి హక్కులు తమకే చెందుతాయని, రిజిస్ట్రేషన్ సౌకర్యంతో ఇళ్లను పూర్తిగా అప్పగిస్తామన్న టీటీడీ మాట తప్పిందని కోర్టుకు విన్నవించారు. నాలుగేళ్లకు ముందు ఒకటి రెండు కేసుల్లో తీర్పు టీటీడీకి అనుకూలంగా వచ్చింది. తాజాగా అదే కేసులో ఆరేడు ఇళ్ల మినహా మిగిలిన ఇళ్లకు సంబంధించిన అన్ని కేసులకు సంబంధించిన తీర్పు టీటీడీకి అనుకూలంగా వెలువడింది. ఆరు నెలల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలని, 25 ఇళ్లపైబడి అనుభవించిన రోజుల్లో నెలకు రూ.500 చొప్పున అద్దె చెల్లించాలని తీర్పు వెలువడింది. దీనికితోడు టీటీడీ సేవలు వినియోగించుకునందుకు పరిహారం కూడా చెల్లించాలని కోర్టు పేర్కొంది.
పునరావాసం కల్పించాలని వేడుకోలు
తరతరాలుగా తిరుమలేశుడినే నమ్ముకుని జీవిస్తున్న తమకు టీటీడీ ప్రత్యామ్నాయం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో మాస్టర్‌ప్లాన్ కింద స్థానికులకు టీటీడీ ఇచ్చిన ప్యాకేజీలు తమకూ అందజేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. టీటీడీ సానుకూలంగా స్పందిస్తే సంపూర్ణంగా సహకరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఆర్‌బీ సెంటర్ వాసులకు శరాఘాతం
Published Tue, Jan 20 2015 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement