Tirupati court
-
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా.. విచారణ వాయిదా
సాక్షి, తిరుపతి: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం తిరుపతి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్యజ్యోతి ప్రచురించిన అసత్య కథనాలపై టీటీడీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రికపై సుబ్రహ్మణ్యస్వామి వందకోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన సుబ్రహ్మణ్య స్వామి.. టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారు. అయితే న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా వేసింది. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదని తెలిపారు. కేసులో వాదనలు వినిపించేందుకు హైకోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకు వచ్చానని చెప్పారు. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడిందన్నారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఆంధ్రజ్యోతి అసత్య వార్తను ప్రచురించారని విమర్శించారు. దీనికి సంబంధించి దేవస్థానం అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించిందని తెలిపారు. చదవండి: TTD: తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు -
తిరుపతి కోర్టుకు నటులు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్
సాక్షి, తిరుపతి: నటుడు మంచు మోహన్‌బాబు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా కోర్టుకు వచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో 2019లో అప్పటి ప్రభుత్వం మోహన్‌బాబుపై కేసు నమోదు చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 2019లో మదనపల్లి హైవేపై మోహన్‌బాబు ఫ్యామిలీ ఆందోళన చేసింది. దీంతో ఆరోజు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయస్థానం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 20కు వాయిదా వేసింది. చదవండి: (మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని) -
కోర్టు సముదాయాల ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి క్రైం /తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు సముదాయాల ఎదుట శనివారం ఒక మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. అరుణ అనే మహిళ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న తిరుపతి ఖాదీకాలనీకి చెందిన ఆదర్స్‌రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ గతంలోనే వివాహమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. వారి మధ్య విభేదాలు రావడంతో తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని డాక్టర్‌పై ఆమె మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరిగి ఆమె తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదంటూ కోర్టు ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలోని పోలీసులు గుర్తించి ఆమెను వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు కోర్టు సముదాయాల వద్ద ఉన్నారు. మహిళ కోర్టు ఎదుట హల్చల్ చేయడంతో ప్రజలు గుమికూడారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీరించడానికి ఇబ్బంది పడ్డారు. కోర్టు ఆవరణం వెస్టు స్టేషన్ పరిధిలోకి రావడంతో వెస్టు స్టేషన్ ఎస్ఐ, సిబ్బంది వాహనంలో వచ్చి ఆమెను స్టేషన్‌కు తరలించారు. -
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే..
జామీనుదారులకు భారీ జరిమానా ఒక్కొక్కరికి రూ.50 వేలు తిరుపతిలో నాలుగో అదనపు జడ్జి తీర్పు డబ్బుకు కక్కుర్తిపడి ముక్కూ ముఖం తెలియని నిందితులకు.. జామీను ఇస్తే.. మొదటికే మోసం వస్తుందన్న విషయం మరోసారి తిరుపతి కోర్టు సాక్షిగా.. తేటతెల్లమైంది. మహిళా చైన్ స్నాచర్లు ఇచ్చిన మొత్తానికి ఆశపడిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. మొదట వారికి జామీను ఇచ్చారు. చివరికి వారిని సకాలంలో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. దీంతో ఏకంగా ఒక్కొక్కరు రూ. 50 వేలు జరిమానాగా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతి లీగల్: ప్రభుత్వ ఉద్యోగులై ఉండి చిన్న మొత్తానికి ఆశపడి తెలియని వ్యక్తులకు జామీను ఇచ్చి, నిందితులను కోర్టులో హాజరుపరిచని ఒక్కొక్కరికీ రూ. 50 వేలు జరిమానా చెల్లించాలని తిరుపతి అదనపు జూనియర్ జడ్జి సన్యాసినాయుడు మంగళవారం తీర్పు ఇచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన ఇందుమతి, తాయమ్మ 2014లో శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా ఆరుగురు మహిళా భక్తుల వద్ద బంగారు చైన్లను అపహరించుకెళ్లారు. దీనిపై చంద్రగిరి పోలీసులు ఆ ఇద్దరి మహిళలపై కేసులు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలిం చారు. ఇద్దరి తరఫున ఓ న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా కోర్టు ఒకొక్క క్రైంలో రూ.10 వేలు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలలో ఉద్యోగులుగా ఉన్న తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన మునికృష్ణయ్య, రంగనాథ్ నిందితులకు జామీను ఇచ్చారు. ఆ తర్వాత నిందితులు ఇద్దరూ జైలు నుంచి విడుదలై పరారయ్యారు. ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరికి జామీను ఇచ్చిన మునికృష్ణయ్య, రంగనాథ్‌కు నోటీసులు ఇచ్చారు. అరుునా కూడా ఇద్దరు నిందితురాళ్లను కోర్టులో హాజరుపరచలేక పోయారు. దీంతో న్యాయమూర్తి జామీనుదారులు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఇద్దరూ కోర్టులో జామీను సొమ్ము చెల్లించారు. అలాగే వీరు మరో కేసులో కూడా సొమ్ము చెల్లించాల్సి ఉండడం గమనార్హం. -
అలిపిరి కేసు; మాజీ మావోయిస్టుకు విముక్తి
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన 2003 అక్టోబర్ 1న జరిగిన దాడి కేసులో కోర్టు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకేకృష్ణను కోర్టు నిర్దోషిగా పేర్కొంది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సందానందమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో 25వ నిందితుడిగా అభియోగాలు ఎదురొన్న దామోదరంను తిరుపతి టూటౌన్ పోలీసులు బెంగళూరులో 2014లో అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్ష్యులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్ష్యం చెప్పాలని కోర్టు సమన్లు పంపినా వారు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. -
మిథున్ రెడ్డికి బెయిల్
చిత్తూరు: రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడా కూడిన బెయిల్ ఇచ్చింది. నెల రోజుల పాటు నెల్లూరు జిల్లా విడిచి వెళ్లరాదని.. చిత్తూరు జిల్లాలో ఎక్కడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని షరతులు విధించింది. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ ఇన్ చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేణిగుంటలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం, నెల్లూరు జిల్లా కేంద్రకారాగారంలో వారు రిమాండ్ అనుభవిస్తుండడం తెలిసిందే. -
ఆర్బీ సెంటర్ వాసులకు శరాఘాతం
ఇళ్లు ఖాళీ చేయాలని కోర్టు తీర్పు మాస్టర్ ప్లాన్ ప్యాకేజీ ఇవ్వాలని స్థానికుల వేడుకోలు కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన తిరుమల: తరతరాలుగా శ్రీవేంకటేశ్వర స్వామివారిని నమ్ముకుని జీవిస్తున్న తిరుమల వాసులకు మరో చేదు కబురు అందింది. రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఎదురుగా ఉన్న 64 ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని సోమవారం తిరుపతి కోర్టు తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఆరునెలల్లోగా వారు ఇళ్లను ఖాళీ చేయాల్సి ఉంది. టీటీడీ తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 1973లో రెండో ఘాట్‌రోడ్డు ఏర్పడ్డాక తిరుమలకు భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. భక్తులకు అనుగుణంగా టీటీడీ కూడా సౌకర్యాలు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధుల చుట్టూ ఉండే స్థానిక నివాసాలను తొలగించాలని నిర్ణయించారు. తొలుత దక్షిణ మాడ వీధిలో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని దేవస్థానం అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా 1974లో ఆలయ దక్షిణ మాడ వీధిలో హథీరాం మఠం ఆనుకుని ఉండే పూటకూళ్లమిట్ట, గజేంద్రమోక్షం ఇటుఇటుగా ఉండే కొన్ని గుడిసెలు, మరికొన్ని పక్కా ఇళ్లను తొలగించారు. వారికి రిహాబిలిటేషన్ సెంటర్ పేరుతో సుమారు 64 ఇళ్లను టీటీడీ అధికారికంగా నిర్మించించి కేటాయించింది. 1999 నాటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఆ ఇళ్లను ఖాళీ చేయాలని ఇక్కడి స్థానికులకు టీటీడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై స్థానికులు వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. 25 ఏళ్ల తర్వాత ఇళ్లపై పూర్తి హక్కులు తమకే చెందుతాయని, రిజిస్ట్రేషన్ సౌకర్యంతో ఇళ్లను పూర్తిగా అప్పగిస్తామన్న టీటీడీ మాట తప్పిందని కోర్టుకు విన్నవించారు. నాలుగేళ్లకు ముందు ఒకటి రెండు కేసుల్లో తీర్పు టీటీడీకి అనుకూలంగా వచ్చింది. తాజాగా అదే కేసులో ఆరేడు ఇళ్ల మినహా మిగిలిన ఇళ్లకు సంబంధించిన అన్ని కేసులకు సంబంధించిన తీర్పు టీటీడీకి అనుకూలంగా వెలువడింది. ఆరు నెలల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలని, 25 ఇళ్లపైబడి అనుభవించిన రోజుల్లో నెలకు రూ.500 చొప్పున అద్దె చెల్లించాలని తీర్పు వెలువడింది. దీనికితోడు టీటీడీ సేవలు వినియోగించుకునందుకు పరిహారం కూడా చెల్లించాలని కోర్టు పేర్కొంది. పునరావాసం కల్పించాలని వేడుకోలు తరతరాలుగా తిరుమలేశుడినే నమ్ముకుని జీవిస్తున్న తమకు టీటీడీ ప్రత్యామ్నాయం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో మాస్టర్‌ప్లాన్ కింద స్థానికులకు టీటీడీ ఇచ్చిన ప్యాకేజీలు తమకూ అందజేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. టీటీడీ సానుకూలంగా స్పందిస్తే సంపూర్ణంగా సహకరిస్తామని స్పష్టం చేస్తున్నారు. -
తిరుపతి కోర్టు ఆవరణలో ఉత్కంఠ
తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో గురువారం ఉత్కంఠ నెలకొంది. అలిపిరి వద్ద 2003 అక్టోబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడుపై జరిగిన బాంబుదాడి కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి కన్పించింది. న్యాయవాదులతో, తీర్పు వినేందుకు వచ్చిన వారితో, మీడియా రిపోర్టర్లతో అదనపు సహాయ సెషన్స్ కోర్టు హాలు కిక్కిరిసింది. కోర్టు బయట పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. అలిపిరి కేసు తీర్పును ప్రచారం చేసేందుకు టీవీ చానెళ్లు ఉదయం 10 గంటల నుంచి హడావుడి చేశాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులకు 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.700 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వెంకటనాగేశ్వరరావు తీర్పు చెప్పారు. శిక్ష పడిన ముగ్గురు నిందితుల్లో జీ.రామ్మోహన్‌రెడ్డి, ఎస్.నరసింహారెడ్డి, ఎన్.చంద్ర ఇదివరలో బెయిల్‌పై ఉండడంతో నేరుగా కోర్టుకు హాజరయ్యారు. మాకు నేరంతో సంబంధం లేదు నిందితులు ముగ్గురూ కోర్టులో హాజరుకాగా నేరం రుజువయిందని చెప్పుకునేది ఏమైనా ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో ముగ్గురూ తాము మావోయిస్ట్ పార్టీ నుంచి ప్రభుత్వం పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చామన్నారు. అలిపిరి సంఘటనతో తమకు సంబంధం లేదన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తమకు శిక్షా కాలం తగ్గించాలని తమకు కుటుంబ సభ్యులు ఉన్నారని వారు తమపై ఆధారపడి ఉన్నారని అన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తమకు శిక్ష విధిస్తే అజ్ఞాతంలో ఉన్న వారు సంఘంలో కలవడానికి భయపడతారని తెలిపారు. ముగ్గురి తరఫున న్యాయవాది శిక్షా కాలం తగ్గించాలని న్యాయమూర్తికి విన్నవించారు. ముగ్గురు నిందితులకు ఇతరుల నుంచి ముప్పు ఉందని భద్రత కల్పించాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి కోర్టు మానిటరింగ్ సీఐ జగన్మోహన్రెడ్డి, తిరుమల టూటౌన్ ఎస్సై వెంకటరమణ, ఏఎస్ఐ శ్రీరాములును పిలిచి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అనంతరం గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిందితులు ముగ్గురికి నాలుగేళ్లు జైలు, రూ.700 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నా బిడ్డ నేరం చేయలేదు తన బిడ్డ ఎలాంటి నేరం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జరిగిన బాంబు దాడి కేసులో 19వ నిందితుడు జి.రామ్మోహన్‌రెడ్డి తల్లి ఇంద్రావతి మీడియాకు తెలిపారు. తన కుమారుడు ప్రభుత్వం పిలుపుమేరకు మావోయిస్టు పార్టీ నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చాడన్నారు. జర్నలిస్ట్‌గా వేర్వేరు ఇంగ్లీష్ పత్రికల్లో ప్రస్తుతం పనిచేస్తున్నాడని, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం నుంచి పట్టా పొందాడని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ తీర్పు రావడం చాలా బాధాకరమన్నారు. ఈ తీర్పుపై పై కోర్టుకు అప్పీల్‌కు వెళతామని, ఇలాంటి తీర్పు న్యాయవ్యవస్థకు మంచిది కాదని నిందితుల తరఫున న్యాయవాది, పౌరహక్కుల సంఘం నాయకుడు క్రాంతి చైతన్య మీడియాకు తెలిపారు.