తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో గురువారం ఉత్కంఠ నెలకొంది. అలిపిరి వద్ద 2003 అక్టోబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడుపై జరిగిన బాంబుదాడి కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి కన్పించింది. న్యాయవాదులతో, తీర్పు వినేందుకు వచ్చిన వారితో, మీడియా రిపోర్టర్లతో అదనపు సహాయ సెషన్స్ కోర్టు హాలు కిక్కిరిసింది.
కోర్టు బయట పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. అలిపిరి కేసు తీర్పును ప్రచారం చేసేందుకు టీవీ చానెళ్లు ఉదయం 10 గంటల నుంచి హడావుడి చేశాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులకు 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.700 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వెంకటనాగేశ్వరరావు తీర్పు చెప్పారు. శిక్ష పడిన ముగ్గురు నిందితుల్లో జీ.రామ్మోహన్‌రెడ్డి, ఎస్.నరసింహారెడ్డి, ఎన్.చంద్ర ఇదివరలో బెయిల్‌పై ఉండడంతో నేరుగా కోర్టుకు హాజరయ్యారు.
మాకు నేరంతో సంబంధం లేదు
నిందితులు ముగ్గురూ కోర్టులో హాజరుకాగా నేరం రుజువయిందని చెప్పుకునేది ఏమైనా ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో ముగ్గురూ తాము మావోయిస్ట్ పార్టీ నుంచి ప్రభుత్వం పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చామన్నారు. అలిపిరి సంఘటనతో తమకు సంబంధం లేదన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తమకు శిక్షా కాలం తగ్గించాలని తమకు కుటుంబ సభ్యులు ఉన్నారని వారు తమపై ఆధారపడి ఉన్నారని అన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తమకు శిక్ష విధిస్తే అజ్ఞాతంలో ఉన్న వారు సంఘంలో కలవడానికి భయపడతారని తెలిపారు.
ముగ్గురి తరఫున న్యాయవాది శిక్షా కాలం తగ్గించాలని న్యాయమూర్తికి విన్నవించారు. ముగ్గురు నిందితులకు ఇతరుల నుంచి ముప్పు ఉందని భద్రత కల్పించాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి కోర్టు మానిటరింగ్ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి, తిరుమల టూటౌన్ ఎస్సై వెంకటరమణ, ఏఎస్‌ఐ శ్రీరాములును పిలిచి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అనంతరం గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిందితులు ముగ్గురికి నాలుగేళ్లు జైలు, రూ.700 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
నా బిడ్డ నేరం చేయలేదు
తన బిడ్డ ఎలాంటి నేరం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జరిగిన బాంబు దాడి కేసులో 19వ నిందితుడు జి.రామ్మోహన్‌రెడ్డి తల్లి ఇంద్రావతి మీడియాకు తెలిపారు. తన కుమారుడు ప్రభుత్వం పిలుపుమేరకు మావోయిస్టు పార్టీ నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చాడన్నారు. జర్నలిస్ట్‌గా వేర్వేరు ఇంగ్లీష్ పత్రికల్లో ప్రస్తుతం పనిచేస్తున్నాడని, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం నుంచి పట్టా పొందాడని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ తీర్పు రావడం చాలా బాధాకరమన్నారు. ఈ తీర్పుపై పై కోర్టుకు అప్పీల్‌కు వెళతామని, ఇలాంటి తీర్పు న్యాయవ్యవస్థకు మంచిది కాదని నిందితుల తరఫున న్యాయవాది, పౌరహక్కుల సంఘం నాయకుడు క్రాంతి చైతన్య మీడియాకు తెలిపారు.
తిరుపతి కోర్టు ఆవరణలో ఉత్కంఠ
Published Fri, Sep 26 2014 3:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement