
బలహీన ప్రభుత్వం ఎలా విభజిస్తుంది?: మైసూరా
తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుంది? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుంది? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. విభజనను కాంగ్రెస్ తన సొంత వ్యవహారంగా నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టరు? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఏర్పాటు చేసి జీఓఎం టైమ్‌పాస్ సమావేశాలు నిర్వహిస్తోందని విమర్శించారు. జీఓఎం భేటీలు అన్నీ టీ, బిస్కెట్లతో ముగుస్తున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఒంటెత్తు పోకడకు, ఏకపక్ష విభజనకు నిరసనగా వైఎస్ఆర్ సిపి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్ 1ని సమైక్య దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు సమైక్యవాదాన్ని బలంగా వినిపించాలన్నారు. గ్రామసభల ద్వారా సమైక్యతీర్మానాలు చేయాలన్నారు. ఈమొయిల్ రూపంలో ప్రధానికి తీర్మానాలు పంపాలని చెప్పారు. పట్టణాల్లో మానవహారాలు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 1 రాత్రి విభజనకు కారకులైన వారి దిష్టిబొమ్మలతో నరకచతుర్దశి జరుపుతామని చెప్పారు. నవంబర్ 7 మంత్రుల బృందం సమావేశం సందర్భంగా 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం చేస్తామన్నారు. సమైక్యం కోరుకునే వారంతా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని మైసూరా రెడ్డి పిలుపు ఇచ్చారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని సమావేశపర్చాలన్నారు. అసెంబ్లీలో సమైక్యతకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విభజన విషయంలో నైతిక విలువలు కూడా పాటించడం లేదని బాధపడ్డారు. అసెంబ్లీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.