ఒంగోలు: టీడీపీ హయాంలో నదీ జలాలను తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతే ఎంవీ మైసూరారెడ్డి నిద్రపోయారా అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి నిలదీశారు. ఒంగోలులో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తున్న రోజుల్లో మౌనం దాల్చిన మాజీ మంత్రి మైసూరా ఇప్పుడు న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు వేయడం దుర్మార్గమన్నారు. 2014–19 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆ అంశంపై చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైసూరారెడ్డి నోరు విప్పకపోవడం రాయలసీమపై ఆయనకున్న ప్రేమకు అతి పెద్ద సాక్ష్యమని పేర్కొన్నారు.
ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే నోరెత్తని మైసూరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికలకు ముందు మైసూరా ఎందుకు కలిశారో, ఏం మంతనాలు జరిపారో బహిరంగ రహస్యమే అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే.. చంద్రబాబుకు మైసూరా అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల నాయకులు సైతం అక్కడ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను సక్రమమే అని చెబుతుంటే.. మన దౌర్భాగ్యం కొద్దీ ఒక బాబు, ఒక మైసూరా, ఒక రఘురామరాజుతోపాటు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 రాష్ట్రానికి శనిలా దాపురించాయని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి, సంక్షేమం కోసం చర్చలు పెట్టాలి
టీవీ చానళ్లలో చర్చలను ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కాకుండా.. అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహించాలని సుధీర్‌రెడ్డి సూచించారు. ఏబీఎన్ రాధాకృష్ణ, మైసూరారెడ్డి మధ్య జరిగిన చర్చా కార్యక్రమంలో ఏది పడితే అది మాట్లాడారని మండిపడ్డారు. నదీ జలాల పంపిణీ అనేది సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
అప్పుడు నిద్రపోయారా.. మైసూరా!
Published Fri, Jul 23 2021 3:37 AM | Last Updated on Fri, Jul 23 2021 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment