సర్కారే నిస్సహాయత వ్యక్తంచేస్తే ఎలా?
కబ్జా భూముల్ని ఖాళీ చేయించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్: న్యాయస్థానాల ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలు, న్యాయ పాలన ఆధారంగా నడిచే సమాజానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎంత మాత్రం శుభసూచకం కాదని తేల్చి చెప్పింది. అరాచక శక్తుల ఆజ్ఞలకు లోబడి ప్రజా ప్రభుత్వాలు పని చేయరాదని హితవు పలికింది. బలహీన వర్గాలకు కేటాయించిన భూమిని ఆక్రమించుకుని నివాసం ఉంటున్న వారిని రాజకీయ పార్టీల ప్రతిఘటన కారణంగా ఖాళీ చేయించలేకపోతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కారణాలు ఏవైనా సరే తమ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలంటూ గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃసమీక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
2007 ఆదేశాల పునఃసమీక్ష కోసం ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, సూరారం గ్రామంలోని సర్వే నంబర్ 107లో బలహీన వర్గాల సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన భూమిని దాదాపు 2300 మంది ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారని, ఈ విషయంలో తమకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయడం లేదంటూ కె.ఆర్.భారతి, మరో 11 మంది 2000 సంవత్సరంలో హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను అప్పటి ప్రధాన న్యాయమూర్తి పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టారు. ఆక్రమణదారులను రెండు నెలల్లో ఖాళీ చేయించి కోర్టుకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ 2007లో ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నివేదికను కోర్టు ముందుంచారు. తాము ఆ భూమిని ఖాళీ చేయించడానికి వెళితే ఆక్రమణదారులు, రాజకీయ పార్టీలు కలసి తీవ్రంగా ప్రతిఘటించారని, శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ఖాళీ చేయించే ప్రక్రియను నిలిపేశామని ఆ నివేదికలో పేర్కొన్నారు.
పార్టీల తీరు కారణంగా చూపుతూ ధర్మాసనం ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 2007 ఉత్తర్వుల తరువాత సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించామని, ఆక్రమణదారులు కూడా భూమిని పొందేందుకు అర్హులని అందులో తేలిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పునఃసమీక్ష పిటిషన్‌లో ఎంత మాత్రం పస లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం చెప్పిన కారణం తమను ఏ మాత్రం సంతృప్తిపరచలేదని స్పష్టం చేసింది.