రాష్ట్ర విభజన నిర్ణయంతో రగిలిపోతున్న సీమాంధ్ర ప్రాంత వాసులను బుజ్జగించేందుకు ఒక ఐఐటీ, ఒక ఐఐఎంతో పాటు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖకు తెలియజేసింది. అయితే, తెలంగాణపై కేంద్రం నియమించిన మంత్రుల బృందం ముందు ఈ నిర్ణయాన్ని ఉంచి, దాని ఆమోదం తీసుకోవాల్సి ఉందని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలను కూడా సీమాంధ్రకు కేటాయించాలని హెచ్ఆర్డీ శాఖ నిర్ణయించింది.
కీలకమైన విద్యా సంస్థలన్నీ తెలంగాణలోనే ఉన్నాయన్న వాదన వస్తుండటంతో, రాష్ట్రాన్ని విభజించినా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ సంస్థలను ఆ ప్రాంతానికి కేటాయించినట్లు మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటివల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనం కలుగుతుందంటున్నాయి. ఈ సంస్థలన్నింటినీ నెలకొల్పేందుకు సుమారు రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొల్పే కేంద్ర విద్యా సంస్థలన్నింటికీ బిల్లు రూపంలో రక్షణ ఉండాలని, జాతీయ పార్టీలన్నీ దానిపై సంతకాలు చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం, మూడు సెంట్రల్ యూనివర్సిటీలు
Published Tue, Nov 5 2013 8:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement