పూడిమడక వద్ద తీరాన్ని దాటిన హుదూద్ తుపాన్
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. ఆదివారం ఉదయం విశాఖపట్నం జిల్లా కైలాసగిరి వద్ద తీరం తాకిన తుపాన్ 12 గంటల ప్రాంతంలో తీరం దాటింది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుపాన్ పూర్తిగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పూడిమడకతో పాటు సమీప గ్రామాల్లోకి సముద్రం నీరు వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లో తుపాన్ బలహీనపడుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు తుపాన్ ప్రభావం ఉంటుందని చెప్పారు.
విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో్ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపో్యాయి. తుపాన్ ప్రభావం విశాఖపట్నంపై తీవ్రంగా ఉంది. విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు.