pudimadaka
-
ఐదు మృతదేహాలు లభ్యం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వారి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. శుక్రవారం పూడిమడక తీరానికి వెళ్లిన 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్ సూర్యకుమార్ (19) మృతదేహం శుక్రవారమే లభ్యమైంది. మునగపాకకు చెందిన ఎస్.తేజ విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉంది. గల్లంతైన ఐదుగురి కోసం శనివారం తెల్లవారుజాము నుంచి నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మెరైన్ పోలీసులు గాలించారు. తిరిగివస్తారన్న తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తూ యర్రవరం తీరప్రాంతం, తంతడి బీచ్ వద్ద అందరూ విగతజీవులుగా లభ్యమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. గాలింపు చర్యల్లో నేవీకి చెందిన 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక హెలికాప్టర్ పాల్గొన్నాయి. పూడిమడక తీరంలో గాలిస్తున్న నేవీ హెలికాప్టర్ మృతుల వివరాలు: గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్‌కుమార్ (18), విశాఖకి చెందిన కంపర జగదీష్ (19), అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన సుర్ల జశ్వంత్‌కుమార్ (19), మునగపాకకు చెందిన పెంటకోట గణేష్ (19), యలమంచిలికి చెందిన పూడి రామచందు (19). -
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
-
గల్లంతైన ఆరుగురిలో నాలుగు మృతదేహాలు లభ్యం.. విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు
-
తల్లడిల్లిన మాతృ హృదయాలు
విశాఖపట్నం: తీరంలో గల్లంతైన విద్యార్థుల్లో మండలంలోని చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ ఉన్నారు. వీరిలో గణేష్ మృతిచెందాడు. ఈ రోజు(శనివారం) ఉదయం గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఇక ప్రాణాలతో బయటపడిన తేజ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.చూచుకొండ గ్రామానికి చెందిన పెంటకోట ఆదినారాయణ, నాగమణి దంపతులకు కుమార్తె, కుమారుడు గణేష్ ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నారు. కుమారుడు గణేష్ అనకాపల్లిలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గణేశ్ మృతి వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఈత రావడంతో.. మునగపాక పల్లపు వీధిలో నివాసం ఉంటున్న సూరిశెట్టి కన్నబాబు,హేమ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు తేజ. వీళ్లది కూడా రైతు కుటుంబమే. తేజ అనకాపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి పూడిమడక సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ఈత రావడంతో ఏదొలా ఒడ్డుకు చేరుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని స్థానికులు అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. తేజ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యలమంచిలి: తీరంలో గల్లంతైన విద్యార్థుల్లో పట్టణ పరిధి ఎర్రవరం గ్రామానికి చెందిన పూడి రామచంద్రశేఖర్ ఉన్నాడు. గ్రామానికి చెందిన పూడి శ్రీను, సుజాత దంపతులకు రామచంద్రశేఖర్, పూజ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను వడ్రంగి పని చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాడు. కుమార్తె విజయవాడలో నర్సింగ్, రామచంద్ర శేఖర్ అనకాపల్లి డైట్ కళాశాలలో ఈసీఈ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తన స్నేహితులతో కలిసి పూడిమడక బీచ్‌కు స్నానానికి వెళ్లాడు. తీరంలో కుమారుడు గల్లంతయ్యాడన్న వార్తలో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని అదుపుచేయడం ఎవరితరం కావడం లేదు. తల్లడిల్లిన మాతృ హృదయాలు రోలుగుంట: రోలుగుంటకు చెందిన విద్యార్థి జశ్వంత్‌కుమార్ తీరంలో గల్లంతు వార్త తెలుసుకున్న మాతృహృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇదే గ్రామానికి చెందిన సుర్ల గిరిగోవర్దనరావు, అమ్మాజీకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిని కష్టపడి శక్తిమేర చదివిస్తున్నారు. వీరిలో కుమారుడు జశ్వంత్‌కుమార్ ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు నర్సీపట్నం శారదా ఇంగ్లీష్ మీడియంలో, ఇంటర్ విశాఖ శ్రీచైతన్యం చదివించారు. ప్రస్తుతం అనకాపల్లి దాడి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అనకాపల్లిలో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. తీరంలో గల్లంతైన విషయం తల్లిదండ్రులకు చేరడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. -
అనకాపల్లి: పూడిమడక తీరంలో మరో 2 మృతదేహాలు లభ్యం
-
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో విషాదం
-
పూడిమడిక బీచ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పోలవరంపై చంద్రబాబు కొంగజపం పూడిమడక బీచ్‌లో అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్, యశ్వంత్, సతీష్, గణేష్, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అనకాపల్లి: పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు
-
Anakapalle: పూడిమడక తీరంలో విషాదం
సాక్షి, అనకాపల్లి/సాక్షి అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక మొగ వద్ద విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వారిలో ఒక విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా, అవి గుడివాడ పవన్, జగదీష్, గణేష్‌లవిగా గుర్తించారు. నిన్న రాత్రి ఒక మృతదేహం లభ్యం కాగా, ఈరోజు ఉదయం రెండు మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన విద్యార్థుల కోసం రెండో రోజు రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పూడిమడక బీచ్ రాంబిల్లి మండలం సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకొని కొండ ఉంటుంది. కొండ ఒక వైపు నుంచి సముద్రంలోని నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఇక్కడకు పర్యాటకులు ఎవరూ వెళ్లరు. స్థానికంగా కొందరు మత్స్యకారులే ఉంటారు. ఇంజనీరింగ్ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు సెమిస్టర్ పరీక్షలు రాశారు. పరీక్ష ముగియగానే 12 మంది విద్యార్థులు బైక్‌లపై పూడిమడక బీచ్‌కి వచ్చారు. అందరూ ఇక్కడ సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వారిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తుండగా ఉవ్వెత్తున వచ్చిన అలలు సముద్రంలోకి లాగేశాయి. మిగతా విద్యార్థులు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు పరుగున వచ్చారు. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను మాత్రం ఒడ్డుకు తేగలిగారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం, కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మరంగా గాలింపు చర్యలు జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి, జిల్లా ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు బృందాలు, ఫైర్, మత్స్యకార గజఈతగాళ్లుతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గాలింపు చర్యలు విస్తృతం చేస్తామని జిల్లా ఎస్పీ గౌతమి సాలి చెప్పారు. విద్యార్థులు పూడిమడక బీచ్‌కి వెళ్లడం ఇదే తొలిసారి కావడం కూడా దుర్ఘటనకు కారణమై ఉండోచ్చని పోలీసులు తెలిపారు. -
ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా విశాఖపట్నం జిల్లా పూడిమడక మారింది. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవు అనే మాట తప్పని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) పరిశోధనలు నిరూపించాయి. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల కోరల్స్(పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీటిని మరోచోటికి తరలించి అభివృద్ధి చేసేందుకు కూడా అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా రాష్ట్రంలో జెడ్ఎస్ఐ.. విశాఖ జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు సర్వే నిర్వహించగా.. ఈ ప్రాంతమంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని స్పష్టమయ్యింది. భారతీయ పగడాల వర్గీకరణపై నిరంతర పరిశోధన చేస్తున్న జెడ్ఎస్ఐ మొట్టమొదటిసారిగా ఆంధ్రా తీరంలో 2020 నుంచి ప్రతి ఏటా జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు మూడేళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయి. విభిన్న రకాల పగడపు దిబ్బలు.. పూడిమడక, భీమిలి, రుషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్‌నగర్, ఆర్కేబీచ్, మంగమూరిపేట, తెన్నేటిపార్కు, చింతపల్లి బీచ్‌లలో ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 30 మీటర్ల లోతులో సాగరగర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబాడైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలున్నట్లు గుర్తించారు. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనాఎస్పీ, లిథోపిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్లు కనుగొన్నారు. సాగర గర్భంలో కనుగొన్న పగడపుదిబ్బలు మరోచోట పెంచుకునేందుకు వీలుగా.. ఒక చోట పెరిగే పగడపు దిబ్బల్ని కొంత భాగం తీసి.. మరోచోట పెంచే రకాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి అరుదైన కోరల్స్ పూడిమడకలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. ఈ తరహా కోరల్స్.. మేరీటైమ్ మెడిసిన్ తయారీకీ ఉపయోగపడతాయని గుర్తించారు. ప్రతి ఏటా 9 రోజుల పాటు ఆయా బీచ్‌లలో సబ్–టైడల్, ఇంటర్–టైడల్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి.. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ఫ్లాట్ వార్మ్‌లతో పాటు.. అన్నెలిడ్ జీవజాతుల నమూనాల్ని సేకరించారు. మత్స్యసంపదకు ఉపయుక్తం.. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బల్ని పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే.. సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. విభిన్న జీవరాశుల సమాహారం... పూడిమడక తీరం విభిన్న జీవరాశులతో కళకళలాడుతోందని జెడ్ఎస్ఐ సర్వేలో వెల్లడైంది. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మ జాతి సముద్ర జీవ రాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. పీత జాతికి చెందిన అరుదైన తెనస్, స్పాంజ్, స్టార్ఫిష్, ఇండో పసిఫిక్ సముద్రంలో ఉండే స్టోమోప్నిస్టెస్ సముద్రపు ఆర్చిన్లు, సీ బటర్‌ఫ్లైస్‌గా పిలిచే హెనియోకస్ చేపలు, ఒంటెరొయ్యలు.. ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. మరోసారి సర్వే.. పూడిమడక తీరం.. విభిన్న సముద్ర జీవజాతుల సమాహారంగా ఉంది. ఇక్కడ ఉన్న పగడపు దిబ్బలు చాలా అరుదైన రకాలు. ఈ తరహా సముద్ర గర్భ వాతావరణం ఇక్కడ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. మొత్తం డాక్యుమెంటేషన్ నిర్వహించాం. ఇక్కడి కోరల్స్.. సముద్ర పర్యాటకానికి, వైద్యరంగంలో ఔషదాల తయారీకి, మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని భావిస్తున్నాం. – డాక్టర్ జేఎస్ యోగేష్ కుమార్, జెడ్ఎస్ఐ సీనియర్ సైంటిస్ట్ చింతపల్లి వరకు అరుదైన జీవజాలం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనలకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందించాం. పూడిమడక నుంచి చింతపల్లి వరకు ప్రతి ప్రాంతం విభిన్న రకాల జీవజాతులతో అద్భుతంగా కనిపించాయి. 30 మీటర్ల లోతు వరకు పగడపు దిబ్బల్లో ఉన్న జంతుజాలం ఫొటోల్ని జెడ్ఎస్ఐకి అందించాం. రీఫ్‌లు, కోరల్స్ ద్వారా.. మత్స్యసంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాలి. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్ స్కూబా ఇన్స్ట్రక్టర్ -
గంగపుత్రులకు బెంగలేదు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచడంతోపాటు సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ క్రమంలోనే దశాబ్దాల కాలంగా కేవలం మాటలకే పరిమితమైన పూడిమడిక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తంగా రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెదం తెలిపాయి. ఇందులో తొలిదశలో నాలుగు, మలిదశలో నాలుగు హార్బర్లను నెలకొల్పనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక వద్ద ఫిషింగ్ హార్బర్‌ను మలిదశలోరూ.353.10కోట్ల నిధులతో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో ఏళ్ల కల.. ఇటు విశాఖ హార్బర్... అటు ఒడిశా పారాదీప్... మధ్యలో ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు. దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు హార్బర్ లేకపోవడంతో మత్స్యకారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లు సురక్షిత హార్బర్‌కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అందులోనూ జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఫిషింగ్‌కు ఒడిశా వైపునకే వెళ్తుంటారు. మరోవైపు విశాఖలోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్ బోట్లు, 3వేల ఫైబర్ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో ఇక్కడి హార్బర్ సామర్ధ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం మండలంలోని పూడిమడిక సమీపాన మొగ ప్రాంతంలో హార్బర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాల కాలంగా ఉంది. కానీ ఇన్నేళ్లూ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఐదు నెలల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ హార్బర్ ఏర్పాటు అనుకూలతలపై సర్వే చేపట్టింది. ఢిల్లీకి చెందిన వాప్కాస్ (వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పూడిమడకలో హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపి.. ఆ మేరకు కేంద్ర నిధులతో సంయుక్తంగా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భీమిలిలో జెట్టీ ఏర్పాటు అనుకూలతలపై సర్వే.. ఇక భీమిలి ప్రాంతంలో జెట్టీ నిర్మించేందుకు అనుకూలతలపై సర్వే చేయాలని ఇప్పటికే బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (బెంగళూరు) సంస్థకు మత్స్యశాఖ లేఖ రాసింది. ఆ ప్రాంతంలో సముద్రం లోతు, అలల ప్రభావం, ఇసుక తిన్నెల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి సదరు సంస్థ నివేదిక ఇవ్వాల్సి ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ఈ జెట్టీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెప్పుకొచ్చారు. పోర్టు ఆధీనం నుంచి తప్పించాలి.. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ పోర్టు ఆధీనంలో నడుస్తోంది. హార్బర్లో ఉన్న 11 జెట్టీల్లో నిలిపి ఉంచే బోట్లకు ఏటా పోర్టు సొమ్ము వసూలు చేస్తుంది. వసూలు చేసిన సొమ్ముతో తగిన మౌలిక సదుపాయాల కల్పన, హార్బర్లోకి బోట్లు వచ్చేందుకు అనువుగా డ్రెడ్జింగ్ పనులు చేపట్టడం లేదు. మత్స్యశాఖ ఆధీనంలో ఉంటే తగిన విధంగా దీన్ని మలుచుకోవచ్చు. మత్స్యకారుల కష్టాలు తీరే అవకాశం ఉంది. – దూడ ధనరాజు, బోటు యజమాని మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ఫిషింగ్ హార్బర్‌పై ఆధారపడి బతికే వారిలో వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకునే మహిళలు అధికంగా ఉన్నారు. వీరికి తగిన మరుగు సదుపాయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నూతన ఫిషింగ్ హార్బర్లలో మంచినీరు, మరుగుదొడ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. – అల్లిపిల్లి అప్పలస్వామి, కలాసీ జట్టీ నిర్మాణం చేపడితే మేలు.. పూడిమడక తీరం నుంచి వెయ్యి పడవల్లో వేట సా గిస్తున్నాం. పడవల్ని రోజూ వేటకు తీసుకెళ్లాలంటే ఎనిమిది మంది కలాసీలు మోయాల్సి ఉంటుంది. కలాసీలకు అయ్యే ఖర్చు వేటకు భారంగా మారింది. జట్టీ నిర్మాణం చేపడితే మోత భారం ఉండదు. లంగరు వేసిన పడవల్ని ఇద్దరు తీసుకెళ్లి వేట చేయగలుగుతారు. – చింతకాయల కాసుబాబు, మత్స్యకారుడు, పూడిమడక 20 ఏళ్లుగా జట్టీ కావాలని అడుగుతున్నాం.. పూడిమడకలో జట్టీ నిర్మాణం చేపట్టాలని 20 ఏళ్లుగా అడుగుతున్నాం. తుపాను వచ్చిందంటే చాలు కంటిమీద కునుకు ఉండదు. సముద్రం ముందుకు వచ్చిన ప్రతిసారీ పడవల్ని భద్రపరుచుకోవడానికి అవస్థలు పడుతున్నాం. పడవల్ని భద్రపరుచుకోకపోతే ఒకదానికొకటి తాకి మరమ్మతులకు గురవుతున్నాయి. మోగకు వెళ్లే రహదారిని బాగుచేయాలి. – గనగళ్ల బాపయ్య, మత్స్యకారుడు, పూడిమడక పడవలు దెబ్బతింటున్నాయి ఇదివరకు చిన్నపడవలు వినియోగించేవాళ్లం. ఇప్పుడు కోనాం, సూరల వేటకు పెద్దపడవల్ని వినియోగిస్తున్నాం. పడవని జరపడం ఇబ్బందిగా ఉంది. జట్టీ నిర్మిస్తే కలాసీల అవసరం లేకుండా వేటసాగుతుంది. సముద్రం కోతకు గురైనప్పుడు తీరంలో పడవలు దెబ్బతింటున్నాయి. జట్టీ నిర్మిస్తే సమస్యలన్నీ పోతాయి. – వాడముదుల అమ్మోరు, మత్స్యకారుడు, పూడిమడక త్వరలో సర్వే చేస్తాం.. పూడిమడకలో హార్బర్‌ను గ్రీన్ ప్రాజెక్ట్‌గా చేపడతాం. ఆ మేరకు త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలోనే మత్స్యశాఖ తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు లేఖ కూడా రాశాం. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది –పి.కోటేశ్వరరావు, అడిషనల్ డైరెక్టర్, మత్స్యశాఖ శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో శీతల గిడ్డంగి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం 3 టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగి ఏర్పాటు చేశారు. దీన్ని ఎండు చేపలు నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారు. కనీసం 30 టన్నుల సామర్థ్యం గల గిడ్డంగి ఉంటే రొయ్యలు అధికంగా లభ్యం అయినప్పుడు ఇందులో నిల్వచేసుకుని ధర పలికినప్పుడు అమ్ముకోవచ్చు. గిడ్డంగి లేకపోవడం వల్ల రొయ్యలకు గిట్టుబాటు ధర లభ్యం కావడం లేదు. – బర్రి కొండబాబు, అధ్యక్షుడు, విశాఖ కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ -
సీఐ హుస్సేన్‌పై సస్పెన్షన్ వేటు
విశాఖపట్నం : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఉన్న కేసులో జిల్లాలోని పూడిమడక మెరైన్ సీఐ హుస్సేన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎ. రవిచంద్ర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో చేరిన నాటి నుంచి హుస్సేన్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆ క్రమంలో అతడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఏసీబీ అధికారులు హుస్సేన్ నివాసంపై దాడి చేశారు. అందులోభాగంగా హుస్సేన్... కోట్ల రూపాయిలు కూడబెట్టినట్లు గుర్తించారు. సీఐ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో డీఐజీ ఎ.రవిచంద్ర సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్టీపీసీకి కేంద్ర పర్యావరణ శాఖ షాక్
విశాఖ: విశాఖ జిల్లా పూడిమడక విద్యుత్ కేంద్రాన్ని మరో ప్రాంతానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పూడిమడక అనుకూలం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పర్యావరణశాఖ నివేదిక సమర్పించింది. పూడిమడక సునామీ బారిన పడే ప్రాంతం అని పర్యావరణ శాఖ హెచ్చరించింది. పర్యావరణ శాఖ నివేదిక మేరకు విద్యుత్ కేంద్రం మార్పుపై కేంద్రం చర్యలు చేపట్టింది. పూడిమడకలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. -
పూడిమడక వద్ద తీరాన్ని దాటిన హుదూద్
-
పూడిమడక వద్ద తీరాన్ని దాటిన హుదూద్ తుపాన్
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. ఆదివారం ఉదయం విశాఖపట్నం జిల్లా కైలాసగిరి వద్ద తీరం తాకిన తుపాన్ 12 గంటల ప్రాంతంలో తీరం దాటింది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుపాన్ పూర్తిగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూడిమడకతో పాటు సమీప గ్రామాల్లోకి సముద్రం నీరు వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లో తుపాన్ బలహీనపడుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు తుపాన్ ప్రభావం ఉంటుందని చెప్పారు. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో్ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపో్యాయి. తుపాన్ ప్రభావం విశాఖపట్నంపై తీవ్రంగా ఉంది. విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు.