
మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొస్తున్న మెరైన్ పోలీసులు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. వారి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. శుక్రవారం పూడిమడక తీరానికి వెళ్లిన 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో నర్సీపట్నం పెదబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్ సూర్యకుమార్ (19) మృతదేహం శుక్రవారమే లభ్యమైంది. మునగపాకకు చెందిన ఎస్.తేజ విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతడి పరిస్థితి విషమంగానే ఉంది. గల్లంతైన ఐదుగురి కోసం శనివారం తెల్లవారుజాము నుంచి నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మెరైన్ పోలీసులు గాలించారు. తిరిగివస్తారన్న తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేస్తూ యర్రవరం తీరప్రాంతం, తంతడి బీచ్ వద్ద అందరూ విగతజీవులుగా లభ్యమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. గాలింపు చర్యల్లో నేవీకి చెందిన 2 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఒక హెలికాప్టర్ పాల్గొన్నాయి.
పూడిమడక తీరంలో గాలిస్తున్న నేవీ హెలికాప్టర్
మృతుల వివరాలు: గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్‌కుమార్ (18), విశాఖకి చెందిన కంపర జగదీష్ (19), అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన సుర్ల జశ్వంత్‌కుమార్ (19), మునగపాకకు చెందిన పెంటకోట గణేష్ (19), యలమంచిలికి చెందిన పూడి రామచందు (19).
Comments
Please login to add a commentAdd a comment