ఇచ్చిందే స్వల్పం..అందులోనూ స్వార్థం
పాలకొండ:గత అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సుమారు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నా.. పునరుద్ధరణ పనుల పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.50 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. తుపాను దాటికి జిల్లాలో విద్యుత్, రవాణా, నీటిపారుదల, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు కమిటీలు వచ్చి నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. రెండు నెలలు గడిచిన తర్వాత కూడా ఆ కోటిన్నర తప్ప ప్రభుత్వం నుంచి ఇంకేమీ అందలేదు. వచ్చిన ఆ కొద్దిపాటి నిధులనైనా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు.. ముఖ్యంగా ఎక్కువ నష్టం వాటిల్లిన నియోజకవర్గాలకు కేటాయించాల్సిన బాధ్యతను అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు విస్మరించారు.
విడుదలైన మొత్తంలో కార్మిక మంత్రి అచ్చెన్ననాయుడు నియోజకవర్గమైన టెక్కలికి రూ.90 లక్షలు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గానికి రూ.60 కేటాయించారు. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు ఒక్కపైసా అయినా కేటాయించలేదు. జిల్లాలకు తుపాను సాయం కింద ఇప్పటివరకు ఈ 1.50 కోట్లే వచ్చాయని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని, మరిన్ని నిధుల విడుదల గురించి తామేమీ చెప్పలేమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చిన నిధులను ఆ రెండు నియోజకవర్గాలకే తరలించుకుపోతే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎక్కువ నష్టం ఎక్కడంటే..
వాస్తవానికి తుపాను వల్ల టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గాల కంటే శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, పాతపట్నం తదితర నియోజకవర్గాల్లో ప్రభుత్వ శాఖలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి రహదారులు, గ్రామీణ నీటిపారుదలకు సంబంధించి విద్యుత్ మోటార్లు కాలిపోవడ ంతో పాటు పలు రకాల మౌలిక వసతులపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. అయితే ఈ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడం గమనార్హం. ఉన్న నిధులను పలుకుబడి ఉన్న నేతలే పట్టుకుపోవడంతో మిగతా నియోజకవర్గాల పరిస్థితి దయనీయంగా మారింది.