జూరాల డ్యామ్ నుంచి శ్రీశైలం వైపునకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/కర్నూలు సిటీ/పోలవరం రూరల్/ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్): ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాలు, పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఉప నదుల నుంచి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు నిండిపోవడంతో అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు 1.94 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీరు తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటోంది. జూరాలలో బుధవారం సాయంత్రం 5 గంటలకు 24 గేట్లు పైకెత్తి 1,85,116 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు 187 కిలోమీటర్ల మేర ప్రవహించి గురువారం ఉదయానికి శ్రీశైలం జలాశయానికి చేరుకునే అవకాశం ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 804 అడుగుల నీటి మట్టంతో 31.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దాదాపు 11 నెలల తరువాత శ్రీశైలానికి కృష్ణా జలాలు రానున్నాయి. గురువారం ఉదయం 6 గంటలకు 1,62,444 క్యూసెక్కుల నీరు మల్లన్న చెంతకు చేరుకోనున్నట్లు సీడబ్ల్యూసీ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని నదీ తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ధవళేశ్వరం నుంచి దిగువకు విడుదలవుతున్న గోదావరి వరద నీరు
వంశధారలో తగ్గిన ప్రవాహం
తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది. బుధవారం 14,613 క్యూసెక్కులు తుంగభద్ర(టీబీ) డ్యామ్‌లోకి చేరడంతో నీటి నిల్వ 26.69 టీఎంసీలకు చేరుకుంది. బీమా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉజ్జయిని డ్యామ్‌లోకి 58,450 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 67.65 టీఎంసీలకు చేరుకుంది. టీబీ డ్యామ్, ఉజ్జయిని డ్యామ్ నిండితే తుంగభద్ర, భీమా నదుల ప్రవాహం కృష్ణాలో నదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకుంటుంది. వంశధారలో వరద ప్రవాహం ఒకింత తగ్గింది. గొట్టా బ్యారేజీలోకి 4,419 క్యూసెక్కులు రాగా, అదేస్థాయిలో వరద నీటిని సముద్రంలోకి వదిలారు.
పోటెత్తుతున్న వరద గోదావరి
గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు తదితర ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా గోదావరిలో చేరుతోంది. గోదావరిలో పోలవరం కాఫర్‌డ్యామ్ చుట్టూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో వరద గంట గంటకూ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం 5.50 లక్షల క్యూసెక్కులు ఉండగా.. సాయంత్రం 6 గంటలకు 7 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 27.20 మీటర్లకు చేరింది. పోలవరం వద్ద వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరితే, స్పిల్ వే మీదుగా వరద నీటిని మళ్లించాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సూచించింది. ఆ మేరకు స్పిల్‌వే రివర్ స్లూయిజ్‌లను తెరిచిన అధికారులు వరదను స్పిల్ చానల్ మీదుగా గోదావరిలోకి మళ్లిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రక్షణ చర్యలు చేపడతున్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీరు
ఒకేరోజు 65 టీఎంసీలు కడలిలోకి..
గోదావరి వరద ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా చేరుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 3,18,227 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. సాయంత్రం 6 గంటలకు 6,96,362 కూసెక్కులకు చేరుకుంది. కాలువలకు 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 174 గేట్లను ఎత్తిన అధికారులు 6,87,362 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ అంటే 24 గంటల్లో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 65 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 180 టీఎంసీలు కడలిలో కలిసిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment