
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కల్పతరువైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం ఆమోదం లేకుండానే ఏక పక్షంగా పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హడావిడిగా నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు వ్యయం 2010–11 ధరల మేరకు రూ.16,010 కోట్లు కాగా.. ఇప్పుడు ఏకంగా రూ.55,548.87 కోట్లకు పెంచుతూ సాగునీటి శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో 21ని జారీ చేశారు. కేంద్రం అనుమతి లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టి పూర్తి కాకుండా చేసే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఈ చర్య ద్వారా స్పష్టం అవుతోందని ఇంజినీర్లతో పాటు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
నేడు ఢిల్లీలో సమావేశం.. అంతలోనే జీవో
పోలవరం అంచనా వ్యయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై సోమవారం కేంద్ర జలవనరుల సంఘం కార్యదర్శి యు.పి.సింగ్ నేతృత్వంలో సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా సెలవు రోజైనప్పటికీ ఆదివారం అంచనా వ్యయాన్ని పెంచేస్తూ జీవో 21 జారీ చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,940 కోట్లకు పెంచుతూ, ఇందుకు ఆమోదం తెలపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అప్పటి నుంచి ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపుపై ఢిల్లీలో సాంకేతిక సలహా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఒక రోజు ముందు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు పెంచుతూ జీవో జారీ చేయడం వెనుక ఏదో దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
జలవనరుల సంఘం ఆమోదిస్తేనే..
పోలవరం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు.. చివరకు ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు తాకట్టు పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడితే కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు అందవనే కారణంతో చంద్రబాబు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం ఇష్టానుసారం ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాల్ని పెంచేస్తూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు నామినేషన్లపై పనులను అప్పగిస్తూ భారీఎత్తున కమిషన్లు దండుకున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో పెరిగిన అంచనా వ్యయానికి కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతారు. ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం గమనార్హం.
జాతీయ ప్రాజెక్టు అని ప్రస్తావించకుండానే
ఆదివారం జారీ చేసిన జీవోలో ఎక్కడా జాతీయ ప్రాజెక్టు అనే పదం వాడకుండా.. కేవలం పోలవరం ప్రాజెక్టుగా పేర్కొనడంపై అధికారులు విస్మయం చెందుతున్నారు. జాతీయ ప్రాజెక్టు అని జీవోలో కచ్చితంగా పేర్కొనాలని, కేవలం పోలవరం ప్రాజెక్టుగా పేర్కొనడం వెనుక దురుద్దేశాలు ఏంటో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపు ప్రతిపాదనలను ప్రాజెక్టు ఈఎన్‌సీ ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ ప్రతిపాదనలను ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖకు పంపి అనుమతి తీసుకున్నారు. ఆదివారమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు పెంచుతూ జీవో 21 జారీ చేసేశారు.