సాక్షి, కర్నూలు: దోమ.. ఈ పేరు వింటనే జనం హడలి పోతున్నారు. ప్రబలుతున్న విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొందరు అధికారులకు మాత్రం దోమలు మంచి నేస్తాలుగా మారాయి. వాటి నిర్మూలనకు కృషి చేయాల్సిన వారు.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను జేబులో వేసుకొని కాలక్షేపం చేస్తున్నారు. లెక్కలు మాత్రం ‘పక్కా’గా చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ముసురు పట్టింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుంటలు, చెరువులు, పిల్ల కాల్వల నిండా నీరు చేరింది.
కొన్ని చోట్ల నీరు నిల్వ ఉండి దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులు వీటి నిర్మూలనకు తగని చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు నగరాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ 5 లక్షల పైచిలుకు జనాభా, 20కిపైగా మురికివాడలు ఉన్నాయి. భారీ వర్షాలతో మురుగు నీరు పోయే మార్గం లేక ఎక్కడికక్కడే నిల్వ ఉంటోంది. చాలా ప్రాంతాల్లో తాగునీటి పంపులు లోతులో ఉండటంతో నీరు అక్కడే నిలిచిపోతోంది. అభివృద్ధి చెందిన కొన్ని కాలనీల్లోనూ రహదారుల పక్కన మరుగునీటి గుంతలు ఉంటున్నాయి. గత మూడేళ్లుగా లార్వా దశలోనే దోమలను నిరోధించడానికి ఏటా రూ. 30 లక్షల చొప్పున రూ. కోటి ఖర్చు పెట్టారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ. 40 లక్షలకు పెంచారు. ప్రతిరోజూ గుర్తించిన మురికివాడల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి. అంతేకాకుండా 200 స్ప్రేయర్లు, ఇతర యంత్రాల సహాయంతో మురుగు గుంతల్లో లార్వాను నిర్మూలించాలి. మలాథియాన్‌తోపాటు ఇతర పదార్థాలను కలిపి గుడ్ల దశలోనే దోమలను నివారిస్తే డెంగీ, మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉండదు.
తప్పుడు నివేదికలు.. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని ఆరోగ్య విభాగం అవినీతికి కేరాఫ్‌గా మారిందనే విమర్శలున్నాయి. ఈ విభాగంలో కిందిస్థాయి అధికారుల అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముందస్తుగా దోమల నివారణకు మలాథియాన్ ఇతర మందులను కొనుగోలు చేసినట్లు చూపిస్తున్నారు. వాస్తవంగా వీటి కొనుగోలులోనే గోల్‌మాల్ జరుగుతోంది. దోమల నివారణ కోసం ఇచ్చిన పరికరాలను బయట అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో ఎక్కడా పూర్తిస్థాయిలో ఫాగింగ్ జరగడం లేదు. నిధులు మాత్రం ఖర్చవుతున్నాయి. అయితే విష జ్వరాలపై ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారు.
ఇక్కడ మరీ దారుణం.. కొన్ని ప్రాంతాల్లో ‘సాక్షి’ పరిశీలించినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయి. శ్రీరామ నగర్, లక్ష్మినగర్, సాయిబాబా నగర్, సంజీవ్‌నగర్ ఇలా నగరంలోని దాదాపు 20 మురికివాడల్లో దోమల లార్వాల నిరోధం కోసం దాదాపు 45 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరందరూ నెలకు లక్షల రూపాయలు విలువైన మందులను వినియోగిస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో ఫాగింగ్, మందుల పిచికారీ చేయడం లేదు. కల్లూరు పరిధిలోని 11 వార్డుల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న చాణిక్యపురి కాలనీలోనూ ఇదే తీరు.
కఠినంగా వ్యవహరిస్తాం : వ్యాధులు ప్రబలకుండా మందుల పిచికారీ, ఫాగింగ్ చేయించడంలో ఈ ఏడాది కఠిన వైఖరిని అవలంబించనున్నట్లు మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఫాగింగ్ చేస్తున్నారా? లేదా? అన్న వివరాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, అక్రమాలు జరిగినట్లు తేలినా, తన దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
మూడేళ్లలో దోమల నిర్మూలనకు పెట్టిన ఖర్చు!
Published Sun, Aug 31 2014 2:31 AM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM
Advertisement
Advertisement