దేవెగౌడను తానే ప్రధానమంత్రిని చేశానని, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రశ్నించారు.
సాక్షి, విజయవాడ :
దేవెగౌడను తానే ప్రధానమంత్రిని చేశానని, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రశ్నించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చంద్రబాబు పాపమేనని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతమ్మ వారి పాదాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి హాజరయ్యారు. ఉదయభాను మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్‌కుమార్ తీర్పుతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి పట్టిన గతి నేడు బహిర్గతమవుతోందన్నారు. ఈ రోజు డెల్టాలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా ప్రకాశం బ్యారేజీ వద్ద ఏ మొహం పెట్టుకొని ధర్నా చేయబోతున్నారని నిలదీశారు.
చంద్రబాబు వెళ్లాక పాలతో శుద్ధిచేస్తాం...
విజయవాడ అర్బన్ కన్వీనర్ జలీల్‌ఖాన్ మాట్లాడుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా చంద్రబాబు బ్యారేజీ వద్ద ధర్నా చేసి వెళ్లిన అనంతరం లారీ పాలతో బ్యారేజీని శుద్ధిచేస్తానని చెప్పారు.
ప్రకాశం బ్యారేజీకి తాళాలు వేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకే చంద్రబాబు నగరానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాన్ని విడదీయడమే కాకుండా కృష్ణా పరీవాహక ప్రాంతాలు బీడుగా మారేందుకు చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగానే ఈ తీర్పు వెలువడిందన్నారు. చంద్రబాబు చేసిన పాపాలతో ఈనాడు రాష్ర్ట ప్రజలందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
తీవ్ర ఉద్రిక్తత...
వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కలిగించారు. ముందుగా పార్టీ సీజీసీ సభ్యుడు సుభాస్‌చంద్రబోస్, ఉదయభాను, జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో సీతమ్మవారి పాదాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో వారికి పోలీసులు అడుగడుగునా ఆటంకం కలిగించారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు, స్పెషల్ బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ర్యాలీ, ధర్నాను బ్యారేజీ వైపు అనుమతించబోమని స్పష్టం చేశారు. నాయకులు ముందుకు వెళ్లకుండా అడ్డుగా నిలబడ్డారు. అయినా పార్టీ నాయకులు ఆగకుండా బ్యారేజీ పైకి చేరుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో జాతీయరహదారిపై కొద్దిసేపు ఉద్రిక ్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ నాయకులు సీతమ్మ వారి పాదాల సమీపంలో ఉన్న ఇరిగేషన్ బిల్డింగ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.
అనంతరం బ్యారేజీ వైపు దూసుకెళుతున్న సుభాస్‌చంద్రబోస్, నాగిరెడ్డి, ఉదయభాను, జలీల్‌ఖాన్ సహా నేతలను, కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో ఎత్తిపడేశారు. అనంతరం వారిని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నిర్వహించిన ధర్నాలో నియోజకవర్గ సమన్వయకర్తలు ఉప్పులేటి కల్పన, జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్, పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి, దూలం నాగేశ్వరరావు, పి.గౌతంరెడ్డి, ఉప్పాల రాంప్రసాద్, సింహాద్రి రమేష్, నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరెడ్డి, గుత్తా రాంచందర్‌రావు, మొండితోక అరుణ్‌కుమార్, తాడి శకుంతల, ఎల్.సునీత, విశ్వనాథ రవి, కాజా రాజ్‌కుమార్, లాకా వెంగళరావు యాదవ్, ముసునూరి రత్నబోస్, దేవినేని చంద్రశేఖర్, మాదివాడ రాము, బీఎన్‌ఆర్, శివారెడ్డి, కంచర్ల రామారావు, ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేతల అరెస్ట్
ధర్నా చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా, నగర నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, ఉదయభాను, జలీల్‌ఖాన్, ఉప్పులేటి కల్పన, గౌతమ్ రెడ్డి, తాతినేని పద్మావతి, ఉప్పాల రాంప్రసాద్, తాడి శకుంతల, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, కె.రత్నకుమారి, సత్తివీరారెడ్డి, చల్లాబ్రహ్మం, లాకా వెంగళరావు, వేల్పుల రవికుమార్, పైడిపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు.