ప్రధాని అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు | Chandrababu meets Deve Gowda and Kumaraswamy | Sakshi
Sakshi News home page

ప్రధాని అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు

Published Fri, Nov 9 2018 4:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Chandrababu meets Deve Gowda and Kumaraswamy - Sakshi

గురువారం బెంగళూరులో దేవెగౌడ, కుమారస్వామితో సీఎం చంద్రబాబు

సాక్షి బెంగళూరు/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఏకమై కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే తమ ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి దేశ వ్యాప్తంగా వివిధ పార్టీ నేతలను కలుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం బెంగళూరులో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అయ్యారు. చర్చల అనంతరం వారితో కలసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థలను విధ్వంసం కాకుండా కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకంకావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 1996లో కాంగ్రెస్‌ బయటనుంచి మద్దతివ్వగా థర్డ్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా దేవెగౌడ ప్రధాని పగ్గాలు చేపట్టారని, అలాంటి ప్రయోగం తర్వాత చేయలేదన్నారు.

ప్రధాని అభ్యర్థిని అంతా కలసి నిర్ణయిస్తామన్నారు. అయితే 1996 మోడల్‌లా ప్రధాని ఉంటారా? అన్న ప్రశ్నకు ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేదు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అంతాకలసి ఒక అభిప్రాయానికి వస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఒక్కటే ప్రధాన, పెద్ద పార్టీ అన్నారు. సీబీఐ, ఐటీ శాఖలతో దాడులు చేయిస్తూ ప్రతిపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని, విపక్షాలను నియంత్రించాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి దాడులు పలు రాష్ట్రాల్లో జరిగాయన్నారు. ఈ విధంగా దాడులు జరుగుతున్నా ప్రధాని మోదీ నోరు తెరవడంలేదని, ఎటువంటి ప్రకటన చేయడంలేదని విమర్శించారు. నోట్ల రద్దు ఓ విఫలప్రయోగమన్నారు. రోజురోజుకూ పెట్రో ధరలు పెరిగిపోతున్నాయని, రూపాయి బలహీనపడుతోందని చెప్పారు. తాను ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ములాయం, అఖిలేశ్‌ యాదవ్, సీపీఎం నేతలు ప్రకాశ్‌ కారత్, సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫారుక్‌ అబ్దుల్లా తదితరులతో భేటీ అయి బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని కోరినట్లు చెప్పారు. 

విపక్షాలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యం..
దేవెగౌడ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కాంగ్రెస్‌ సహా అన్ని పక్షాలూ కలసిరావాలన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓడినట్లే దేశవ్యాప్తంగా బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టి అంతా విపక్షాలను ఏకతాటిపైకి తేవడమేనన్నారు. 1996లో కూడా చంద్రబాబుతో కలిసి పని చేశామని, అలాగే 2019లో కూడా కలుస్తామన్నారు. 1996 ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. డిసెంబర్‌లోగానీ, జనవరిలోగానీ భారీ స్థాయిలో రైతుల ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ఈ ర్యాలీకి ఆహ్వానిస్తామని తెలిపారు.   

నేడు చెన్నైకి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం చెన్నైకి రానున్నారు. కేంద్రంలోని బీజేపీ వ్యతిరేకంగా వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న నేపథ్యంలో  చంద్రబాబు.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ఇక్కడ భేటీ కానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement