శుక్రవారం విజయవాడలో కర్ణాటక సీఎం కుమారస్వామిని సత్కరిస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి/విజయవాడ/విమానాశ్రయం(గన్నవరం): కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం విజయవాడ వచ్చిన కుమారస్వామి ఒక హోటల్‌లో బస చేశారు. ఈ సమయంలో చంద్రబాబు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కుమారస్వామితో చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేస్తేనే కేంద్రాన్ని ఎదుర్కోగలమని చంద్రబాబు తెలిపారు.
కేంద్రంలో ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని, ఈ అంశాలపై కూలంకుషంగా తర్వాత చర్చిద్దామని చెప్పారు. కాంగ్రెస్ తనను సీఎం పీఠంపై కూర్చోబెట్టినా అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తోందని కుమారస్వామి చెప్పినట్లు సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ వైఖరితోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన ఫ్రంట్‌పై రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో చర్చిద్దామని చంద్రబాబుకు ఆయనకు చెప్పినట్లు సమాచారం.
దుర్గమ్మను దర్శించుకున్న కుమారస్వామి
ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన సతీమణి అనిత శుక్రవారం దర్శించుకున్నారు. కుమారస్వామి దంపతులకు ఆలయ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆయనకు శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చానని తెలిపారు.
అమరావతి నిర్మాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నానన్నారు. చంద్రబాబుతో సమావేశమైన అంశాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వచ్చారు. అంతకుముందు కుమారస్వామికి గన్నవరం విమానాశ్రయంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment