- దీనావస్థలో కాంగ్రెస్, టీడీపీ
- సమైక్య ఉద్యమంతో కలవరపాటు
- పరిశీలకులతో అభ్యర్థుల వెదుకులాట
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘అభిప్రాయసేకరణ చేస్తారు.. చివరకు సీల్డ్ కవర్‌లో పేరును ఖరారు చేస్తారు..’ ఇది కాంగ్రెస్ సంస్కృతి. ‘తమ్ముళ్లూ.. నా సర్వేలు నాకుంటాయ్.. గెలిచే వారికే టికెట్లు ఇస్తాను.. అభ్యర్థుల ఎంపిక నాది.. గెలిపించే బాధ్యత మీది..’ ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పరిస్థితి.
ఇప్పుడు స్థితిగతులు మారుతున్నాయి. ప్రజలే నిర్ణేతలుగా శాసించే సమయం వచ్చింది. ఓటరు దేవుళ్ల కరుణాకటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడాల్సిన అవసరం ఏర్పడింది. సమైక్య నినాదానికి కలవరపడుతున్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు ముందుగానే అభ్యర్థులను వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకేనేమో పరిశీలకులను ఇప్పట్నుంచే జిల్లాలకు పంపి అభ్యర్థుల జాబితాలు సేకరించే మిషతో కార్యకర్తల మనోగతాలను పసిగట్టేందుకు, జనం నాడిపట్టుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. రెండు నెలల కిందట టీడీపీ పరిశీలకుడిని జిల్లాకు పంపితే.. తాజాగా బుధవారం కాంగ్రెస్ పరిశీలకులు బందరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థుల విషయంలో అభిప్రాయ సేకరణ చేశారు. సమైక్య ఉద్యమ నేపథ్యంలో రాజకీయంగా ఎదురీదుతున్న తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు పార్టీలు అభ్యర్థుల వెతుకులాటలో తలమునకలయ్యాయి.
టీడీపీలో కొత్త ప్రతిపాదన..
రెండు నెలల కిందట జిల్లాకు వచ్చిన టీడీపీ పరిశీలకుడు సుజనాచౌదరి చేసిన ప్రతిపాదన ఆ పార్టీలో కొత్త సమస్యలకు తెరతీసింది. అప్పట్లో ఆయన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావును బందరు పార్లమెంటు అభ్యర్థిగా వెళ్లాలని, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పెడన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇప్పటికే పెడనపై ఆశలు పెట్టుకున్న కాగిత వర్గీయులకు ఈ ప్రతిపాదన రుచించకపోవడంతో పార్టీలో అసమ్మతి కుంపటి రాజేసినట్టయింది. ఈ ఫార్ములా పనిచేయకపోవడంతో తాజాగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్టు ఆ పార్టీవారు చెబుతున్నారు.
రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపిన కాంగ్రెస్‌లో కొనసాగి ఆ పార్టీ మ్యాండెట్‌పై పోటీచేస్తే గెలుస్తామన్న ధీమాగా లేని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ను టీడీపీలోకి వెళ్లాలని ఆయన అనుయాయులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే బూరగడ్డ వేదవ్యాస్‌ను బందరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పంపించి, కొనకొళ్ల నారాయణతో పెడన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు కొత్త ప్రతిపాదన ప్రచారంలో పెట్టారు.
దిగజారిన కాంగ్రెస్..
కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఏఐసీసీ ప్రతినిధి, బందరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ఎన్.ఎల్.నరేంద్రబాబు, ఏఐసీసీ కార్యదర్శి రామినీడి మురళి వచ్చి అభిప్రాయాలు సేకరించారు. డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో బందరు డీసీసీ కార్యాలయంలో వారు అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. బందరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, మంత్రి కొలుసు పార్థసారథిలతోపాటు డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మేకల కుమార్‌బాబు తదితర పేర్లు పరిశీలకులకు చెప్పారు.
పార్థసారథికి ఎంపీ సీటు ఇస్తే పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆయన భార్య కమలాపార్థసారథికి ఇవ్వాలని పలువురు ప్రతిపాదించారు. బందరు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ప్రస్తుత గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణ యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌లు మేకల కుమార్‌బాబు, బలగం విజయశేఖర్, చిన్నాపురం సర్పంచి జన్ను రాఘవ, గుమ్మడి విద్యాసాగర్ పేర్లు పరిశీలనకు తెచ్చారు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు, గ్రామ సర్పంచి స్థాయి ప్రతినిధుల పేర్లు కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలకు పేర్లు పరిశీలనకు రావడం కొసమెరుపు,