రాష్ట్రంలో హుక్కా కేంద్రాలు రాత్రి 11 గంటల తర్వాత తెరిచి ఉండకూడదని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది.
హుక్కా కేంద్రాల నిర్వాహకులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హుక్కా కేంద్రాలు రాత్రి 11 గంటల తర్వాత తెరిచి ఉండకూడదని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. హుక్కాసెంటర్ల బయట అందరికీ కనిపించేలా సైన్‌బోర్డ్‌లు ప్రదర్శించాలని నిర్వాహకులకు స్పష్టంచేసింది. హుక్కా కేంద్రాల్లో మైనర్లను కాఫీ తాగేందుకు సైతం అనుమతించరాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులిచ్చారు. తాము నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాల విషయంలో పోలీసులు అనవసర జోక్యంతో వేధింపులకు గురిచేస్తున్నారని, తమ కాఫీ షాప్‌లో హుక్కా సరఫరాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఫ్యూమర్స్ కాఫీ లాంజ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
దీనిని విచారించిన జస్టిస్ నూతి రామ్మోహనరావు ఇరుపక్షాల వాదనలు విన్నాక ఈ ఉత్తర్వులిచ్చారు. వీటిని రాష్ట్రం లోని అన్ని హుక్కాకేంద్రాల నిర్వాహకులు పాటించి తీరాలన్నారు. ఒకవేళ పిటిషనర్ వీడియో కెమెరాలతో షాపులో జరిగే కార్యకలాపాలు రికార్డ్ చేయదలచుకుంటే, వీడియోలను 15 రోజులు జాగ్రత్త చేయాలని, అవస రమైతే పోలీసులు వాటిని పరిశీలించేందుకు వీలివ్వాలని పేర్కొన్నారు.