మైనారిటీ విద్యార్థులు సంకటంలో పడ్డారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. సర్కారు నెలవారీగా విడుదల చేసే మెస్ చార్జీల బిల్లులు ఏడాది కాలంగా పేరుకుపోవడంతో విద్యార్థులు తిండి కోసం వీధిన పడ్డారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైనారిటీ విద్యార్థులు సంకటంలో పడ్డారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. సర్కారు నెలవారీగా విడుదల చేసే మెస్ చార్జీల బిల్లులు ఏడాది కాలంగా పేరుకుపోవడంతో విద్యార్థులు తిండి కోసం వీధిన పడ్డారు. జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ సమీపంలో పోస్టుమెట్రిక్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఈ వసతి గృహంలో వసతి కలిస్తారు. ఇలా వసతి పొందే విద్యార్థులకు ప్రతి నెల మెస్ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి రూ.1050 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఏడాదిగా మెస్ చార్జీలు లేవ్..
బండ్లగూడలోని మెనార్టీ వసతి గృహంలోని 50 మందికి వసతి కల్పించే సదుపాయం ఉంది. ఈ విద్యార్థులకు ఏడాది కాలంగా మెస్ చార్జీలు అందడంలేదు. సాధారణంగా నెలవారీగా విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లిస్తేనే.. వాటితో నెలకు సరిపడా సరుకులు తెచ్చుకోవడం.. వంట చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏడాది కాలంగా ఈ విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లించకపోవడంతో స్నేహితుల వద్ద భోజనం చేయడమో.. లేక పస్తులు ఉండాల్సివస్తోందని షాకీర్ అనే విద్యార్థి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.
బకాయిలు రూ. 3.6 లక్షలు..
మైనార్టీ వసతి గృహంలోని విద్యార్థులకు ఏడాది కాలంగా మెస్ చార్జీలు ఇవ్వకపోవడంతో బకాయిలు రూ. 3.6 లక్షలకు చేరాయి. మరోవైపు వసతిగృహంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది 50 మంది విద్యార్థుల్లో 15 ఖాళీలు ఏర్పడినా.. కొత్త విద్యార్థులను చేర్చుకునే పరిస్థితి లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడం గమనార్హం.