గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు. 80 శాతం మంది గాజావాసులు ఇజ్రాయెల్ దాడులకు తాళలేక, దాని బెదిరింపులకు తలొగ్గి ఇప్పటికే ఇల్లూ వాకిలీ వదిలేశారు. కొద్ది నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎలాంటి సహాయక సామగ్రినీ ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో అన్నమో రామచంద్రా అంటూ అంతా అలమటిస్తున్నారు.
వారిలోనూ కనీసం 5 లక్షల మంది అత్యంత తీవ్రమైన కరువు బారిన పడ్డారని ఐరాస ఆవేదన వెలిబుచ్చింది. తాళలేని ఆకలిబాధతో దుర్భర వేదన అనుభవిస్తున్నారని ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) తాజా నివేదికలో వెల్లడించింది. వారికి తక్షణ సాయం అందకపోతే అతి త్వరలోనే గాజా ఆకలిచావులకు ఆలవాలంగా మారడం ఖాయమని హెచ్చరించింది...
నరకానికి నకళ్లు...
గత ఆదివారం గాజా శరణార్థి శిబిరంలో ఓ రెణ్నెల్ల పసివాడు ఆకలికి తాళలేక మృత్యువాత పడ్డాడు. గాజాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చని ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు అక్కడ పదులు, వందలు, వేలల్లో, అంతకుమించి ఆకలి చావులు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నాయి.
ప్రతీకారేచ్ఛతో పాలస్తీనాపై నాలుగున్నర నెలలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆ క్రమంలో గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేయడమే ఇందుకు కారణం. గాజాకు ఆహారం, నిత్యావసరాల సరఫరాను కూడా ఇజ్రాయెల్ వీలైనంతగా అడ్డుకుంటూ వస్తోంది. చివరికి ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కూడా అనుమతించడం లేదు. దాంతో గాజావాసులు అల్లాడిపోతున్నారు. శరణార్థి శిబిరాలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి.
కొన్నాళ్లుగా ఆకలి కేకలతో ప్రతిధ్వనిస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలినాళ్లలో గాజాలోకి రోజుకు 500 పై చిలుకు వాహనాల్లో సహాయ సామగ్రి వచ్చేది. క్రమంగా 50 వాహనాలు రావడమే గగనమైపోయింది. ఇప్పుడవి 10కి దాటడం లేదు! ఉత్తర గాజాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతానికి ఎలాంటి మానవతా సాయమూ అందక ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కూడా చివరిసారిగా జనవరి 23 అక్కడికి సహాయ సామగ్రిని పంపింది.
నాటినుంచి ఇజ్రాయెల్ ఆంక్షలు తీవ్రతరం కావడంతో చేతులెత్తేసినట్టు సంస్థ చీఫ్ ఫిలిప్ లాజరిని స్వయంగా అంగీకరించారు! గాజా ఆకలి కేకలను పూర్తిగా మానవ కలి్పత సంక్షోభంగా ఆయన అభివరి్ణంచారు. ‘‘సహాయ సామగ్రితో కూడిన వాహనాలేవీ గాజాకు చేరకుండా చాలా రోజులుగా ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకుంటోంది. కనీసం ఆహార పదార్థాలనైనా అనుమతించాలని కోరినా పెడచెవిన పెడుతోంది’’ అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
కలుపు మొక్కలే మహాప్రసాదం
ఆకలికి తట్టుకోలేక గాజావాసులు చివరికి కలుపు మొక్కలు తింటున్నారు! ఔషధంగా వాడాల్సిన ఈ మొక్కలను ఆహారంగా తీసుకుంటే ప్రమాదమని తెలిసి కూడా మరో దారి లేక వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మాలో అని పిలిచే ఈ మొక్కలను కట్టకింత అని రేటు పెట్టి మరీ అమ్ముకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకలికి తాళలేక గుర్రాల కళేబరాలనూ తింటున్నారు!
మాటలకందని విషాదం...
యూఎన్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఓసీహెచ్‌ఏ) గణాంకాల మేరకు గాజాలోని మొత్తం 23 లక్షల మందినీ తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. వారిలోనూ ► లక్షల మందికి పైగా తీవ్రమైన కరువు పరిస్థితుల బారిన పడ్డారు. ఇజ్రాయెల్ వైఖరే ఇందుకు ప్రధాన కారణం...
► గాజాలోకి సహాయ సామ్రగి కోసం ఇజ్రాయెల్ కేవలం ఒకే ఒక ఎంట్రీ పాయింట్‌ను తెరిచి ఉంచింది.
► ఆ మార్గంలోనూ దారిపొడవునా లెక్కలేనన్ని చెక్ పాయింట్లు పెట్టి ఒక్కో వాహనాన్ని రోజుల తరబడి తనిఖీ చేస్తోంది.
► దీనికి తోడు అతివాద ఇజ్రాయెలీ నిరసనకారులు పాలస్తీనా వాసులకు సాయమూ అందడానికి వీల్లేదంటూ భీష్మించుకున్నారు.
► దక్షిణ గాజా ఎంట్రీ పాయింట్‌ను కొన్నాళ్లుగా వారు పూర్తిగా దిగ్బంధించారు.
► సహాయక వాహనాలకు భద్రత కలి్పస్తున్న స్థానిక పోలీసుల్లో 8 మంది ఇటీవల ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు. అప్పట్నుంచీ ఎస్కార్టుగా వచ్చే వారే కరువయ్యారు.
► దాంతో గాజాలో సహాయక వాహనం కనిపిస్తే చాలు, జనమంతా ఎగబడే పరిస్థితి నెలకొని ఉంది! వాహన సిబ్బందిని చితగ్గొట్టి చేతికందినన్ని సరుకులు లాక్కెళ్తున్నారు.
► మరోవైపు దీన్ని సాకుగా చూపి ఇజ్రాయెల్ సహాయ వాహనాలను అడ్డుకుంటోంది.
► గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి వందల మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. యుద్ధానికి కారణంగా నిలిచిన ఈ దాడిలో ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) సిబ్బంది పాత్రా ఉందని ఇటీవల తేలడంతో ఆ సంస్థ గాజా నుంచి దాదాపుగా వైదొలగింది. సహాయక సామగ్రి చేరవేతలో ఇన్నాళ్లూ వ్యవహరించిన ఆ సంస్థ నిష్క్రమణతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment