నరకం అనుభవించలేక.. నిత్యం పోరాడలేక.. | Husband Harassment: Wife Commit Suicide in Chittoor | Sakshi
Sakshi News home page

నరకం అనుభవించలేక.. నిత్యం పోరాడలేక..

Published Sun, Oct 29 2017 2:09 PM | Last Updated on Sun, Oct 29 2017 2:39 PM

Husband Harassment: Wife Commit Suicide in Chittoor

కట్టుకున్న వాడి దురాశ, అత్త వేధింపులకు తోడు ముగ్గురు ఆడ బిడ్డలకు జన్మనీయడమే ఆ తల్లికి శాపమైంది.  క్షణక్షణం అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి పొందేందుకు బలవన్మరణాన్ని ఆశ్రయించింది. అత్తింటివారితో పోరాడి అలసిపోయింది. ఇక మరణమే శరణ్యమనుకుంది. చంటి బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. శాంతిపురం      మండలంలో శనివారం జరిగిన ఈ  సంఘటన విషాదం నింపింది. 

శాంతిపురం:  దండికుప్పం పంచాయతీలోని నల్ల  రాళ్లపల్లికి చెందిన బేబి(26) ఏడు నెలల వయసున్న కవల పిల్లలతో సహా పాలారు నదిలో దూకి ప్రాణా లు విడిచిన సంఘటన కలకలం సృష్టించింది. కోటి ఆశలతో 2011లో సొంత వూర్లోనే అత్తింట అడుగుపెట్టిన బేబికి ఆది నుంచి వేధింపులే ఎదురయ్యా యి. పెళ్లయిన మూడు నెలలకే ఆస్తి కోసం భర్త కోదండ, అత్త గోవిందమ్మల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఆస్తిలో వాటా తీసుకురావాలని పుట్టింటికి తరిమేశారు. తండ్రి వెంకటాచలం(జలమప్ప), తల్లి పద్మమ్మలు స్థానికుల సాయంతో సర్దుబాటు చేసి ఆమెను మళ్లీ అత్తింటికి పంపారు.

 అయినా ఇంట్లో గొడవలు తగ్గలేదు. బేబిని తరచూ హింసిస్తుండటంతో స్థానికులు కలగజేసుకునేవారు. కానీ జోక్యం చేసుకున్న వారిని భర్త, అత్తలు దుర్బాషలాడటం, మగ వారికి అక్రమ సంబంధం అంటగట్టి అసభ్యంగా మాట్లాడటంతో స్థానికులు దూరమయ్యారు. మూడేళ్ల క్రితం బేబి ప్రతీకకు జన్మనిచ్చింది. అంతా సర్ధుకుంటుందని పుట్టింటి వారు భావించినా పరిస్థితిలో మార్పు లేకపోయింది. పుట్టింటికి వెళ్లకుండా, వారితో పాటు స్థానికులతో కూడా మాట్లాడకుండా అత్తింటివారు బేబిని కట్టడి చేశారు. 

ఆడబిడ్డలకు జన్మనివ్వటమే శాపం..
ఏడు నెలల క్రితం బేబీ కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆడబిడ్డలు కావడంతో వేధింపులు పతాక స్థాయికి చేరాయి. తరచూ భర్త, అత్త చేయి చేసుకునే వారని, బిడ్డలకు జన్మనిచ్చిన ఆరు రోజుల నుంచే బలవంతంగా వ్యవసాయ పనులు చేయించారని స్థానిక మహిళలు చెబుతున్న మాటలు బేబీ ఎదుర్కొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో పాలు ఒలికిపోయానే కారణంతో అత్త, భర్త బేబిని చితగ్గొట్టారు. వారు పనులకు వెళ్లగానే ముక్కు పచ్చలారని చంటి బిడ్డలతో సహా ఇంటి నుంచి వెళ్లి సమీపంలోని పాలారు నదిలో పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి సమీప గ్రామాల వారు అక్కడికి చేరుకున్నారు. బేబి పరిస్థితులను తెలుసుకుని ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదని వెనుదిరిగారు. తల్లి, తోబుట్టువుల కోసం అమాయకంగా ఎదురు చూస్తున్న ప్రతీక(3) మాటలు జనం గుండెలను పిండాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement