
కొడుకుతో సుమతి
చిత్తూరు,రొంపిచెర్ల: తన భర్త మరొక యువతిని తీసుకుని పది రోజుల క్రితం పరారయిపోయాడని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె సోమవారం విలేకరుల ఎదుట తన గోడు వెల్లబోసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. కె.వి.పల్లె మండలం తువ్వపల్లె కొత్తపల్లెకు చెందిన క్రిష్ణయ్య కుమారై సుమతిని రొంపిచెర్ల పంచాయతీ వారణాసివారిపల్లెకు చెందిన శ్రీనివాసులుకు ఇచ్చి 2012 నవంబరులో పెద్దలు పెళ్లి చేశారు.
వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం సుమతి ఆరు నెలల గర్భవతి. అదనపు కట్నం తీసుకురావాలని శ్రీనివాసులు తల్లి వేధిస్తుండడంతో సుమతి పుట్టింటి నుంచి రూ.35 వేలు తెచ్చి ఇచ్చింది. ఈ క్రమంలో శ్రీనివాసులు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని సుమతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. కొడుకును చూసుకుంటూ ఆమె మౌనంగా భరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు పది రోజల క్రితం తన ప్రియురాలిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. దీనిపై బాధితురాలు ఈ నెల 23వ తేదీన రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో విలేకరులను ఆశ్రయించింది. తన భర్త ఎక్కడ ఉన్నాడో అత్త, మరిదికి తెలిసినా చెప్పడం లేదని వాపోయింది. ఇప్పుటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు తనకు న్యాయం చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment