షేక్ మహమ్మద్ హుస్సేన్
గుంటూరు: పెద్దల ఒప్పందంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని... ఆ తర్వాత నెల రోజులకే తన భార్య కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని... అదేమని అడిగితే కేసులు పెట్టి వేధిస్తుందని... విచారించి న్యాయం చేయాలని నగరంలోని అంకమ్మనగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ హుస్సేన్ కోరారు. ఈ మేరకు తన గోడు విన్నవించేందుకు అర్బన్ ఎస్పీ కార్యాలయానికి శుక్రవారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ 2012లో గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామానికి చెందిన నీరజ ప్రియాంక, తాను ప్రేమించుకున్నామని తెలిపారు. పెద్దల ఒప్పందంతోనే ముస్లిం సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. పట్టుమని నెల రోజులు కూడా తన భార్య తనతో ఉండకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవితాంతం తోడుగా ఉంటుందని భావించి పెళ్లి చేసుకుంటే తనను అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిందని వాపోయారు. కాపురానికి రావాలని ఎన్నిసార్లు కోరినా లెక్కచేయడం లేదన్నారు. అప్పటి నుంచి ఏడేళ్లుగా తనపై అనేక రకాల కేసులు నమోదుచేసి తన భార్య వేధింపులకు గురిజేస్తుందని చెప్పారు. రూ.10 లక్షలు ఇస్తే పెట్టిన కేసులు రాజీ పడతానని చెబుతుందన్నారు. తన భార్య వ్యవహారశైలి కారణంతో తమ కుటుంబమంతా నరకయాతన అనుభవిస్తుందన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు సైతం అనారోగ్యంతో బాధపడుతూ కుమిలిపోతున్నారని పేర్కొన్నారు. తన సమస్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని పోలీసులు చేతులు దులుపుకున్నారని తెలిపారు. తన సమస్యపై అర్బన్ ఎస్పీ రామకృష్ణ స్పందించి న్యాయం చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment