♦ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
♦ చిచ్చు రేపిన భర్త వివాహేతర సంబంధం
♦ కన్నీరుమున్నీరైన మృతురాలి బంధువులు
భర్త వివాహేతర సంబంధం భార్య ప్రాణాలు తీసింది.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.. పర్యవసానంగా పిల్లల ఆలనాపాలనా చూసే వారెవరనే విషయం ప్రశ్నార్థకమైంది.. తమ కూతురిని కట్టుకున్న భర్తే పొట్టన పెట్టుకున్నాడని, వాడికి ఇవ్వకపోతే కళ్లెదుటే ఉండేదని మృతురాలి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని పుష్పగిరి మాన్యంలో నివాసముంటున్న మలిగిరి సాలమ్మ(23) అనే వివాహిత గురువారం ఇంటిలోనే తన చీరెతోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఉస్సేనయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తరుచూ వేధింపులకు గురి చేయడంతో తట్టులేక ఈ అఘాయిత్యం చేసుకుంది.
మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీకి చెందిన దూదేకుల నాగమ్మకు ఆరుగురు సంతానం. వీరిలో నాలుగో సంతానం సాలమ్మ. సాలమ్మకు ఎర్రగుంట్ల పుష్పగిరి మాన్యంలో ఉన్న సుభాన్ కుమారుడు మలిగిరి ఉస్సేనయ్యకు ఆరేళ్ల క్రితం వివాహం అయింది.
ఆయన బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ద స్తగిరి, సుభాన్ అనే చిన్నారులు ఉన్నారు. ఉస్సేనయ్య తల్లిదండ్రులు పక్కన సంసారం ఉంటున్నారు. ఉస్సేనయ్య తన భార్య పిల్లలతో నివాసం ఉంటున్నారు.
అయితే ఉస్సేనయ్యకు మరో మహిళతో వివాహేతర సంబంధం కల్గి ఉండడంతో, ఈ విషయంపై ఆయనను భార్య తరుచూ అడుగుతుండేది. దీంతో ఉస్సేనయ్య భార్యను వేధింపులకు గురి చే సే వాడని మృతురాలి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేకనే సాలమ్మ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉన్న కొక్కికి చీరె కట్టి ఉరి వేసుకొని మృతి చెందింది.
బయట ఆడుకుంటున్న చిన్నారులు ఇంటిలోకి వెళ్లడానికి వేసి ఉన్న వాకిలి వద్ద ఏడుస్తూ ఉండడం గమనించిన స్థానికులు పోయి ఇంటిలోకి తొంగి చూశారు. అప్పటికే సాలమ్మ ఉరి వేసుకొని వేలాడుతూ ఉండడం గమనించారు. వెంటనే తలుపులు తీసి లోనికి వెళ్లి వేలాడుతున్న ఆమెను కిందికి దించారు. తర్వాత ప్రైవేటు వైద్యాధికారిని పిలిపించారు. ఆయన పరీక్షించి అప్పడికే మృతి చెందినట్లు చెప్పారు. బంధువులు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సంజీవరెడ్డి పరిశీలించారు.
అమ్మా.. లేవమ్మా...
అమ్మ చనిపోయిందనే విషయం పిల్లలకు తెలియదు. ఎంత పిలిచినా పలకక పోవడంతో సాలమ్మ నిద్రపోతుందేమోనని భావించారు. అమ్మా.. లేవమ్మా.. ఇదిగో బిస్కెట్ తెచ్చినాను తినమ్మా అంటూ ఆమె చిన్న కుమారుడు సుభాన్ తల్లి మృతదేహాన్ని పట్టుకుని పిలుస్తున్న తీరు చూపరుల హృదయాన్ని కలిచి వేసింది.
పెద్ద కుమారుడు దస్తగిరి బయట ఇంటి ముందు గుమికూడిన జనాలను చూస్తూ ఏం జరిగిందో తెలియని స్థితిలో ఒంటరిగా కూర్చోని ఉండిపోయాడు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు చిన్నారులకు ఎంత కష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అబల బలి
Published Fri, Apr 3 2015 2:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement