ఆంధ్ర హుస్సేన్ సాగర్ | Hussain Sagar in Andhra | Sakshi
Sakshi News home page

ఆంధ్ర హుస్సేన్ సాగర్

Published Tue, Aug 19 2014 2:13 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

ఆంధ్ర హుస్సేన్ సాగర్ - Sakshi

ఆంధ్ర హుస్సేన్ సాగర్

  • బ్రహ్మయ్య లింగం చెరువుకు మహర్దశ
  •  రూ.200కోట్ల వ్యయం
  •  మొదటి విడతగా రూ.50  కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి వినతి
  •  ఉడా ప్రతిపాదనలు
  •  సీఎంకు కలెక్టర్ నివేదిక
  • సాక్షి, విజయవాడ : అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలు అన్ని యథావిధిగా అమలు జరిగితే ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో విస్తరించి ఉన్న బ్రహ్మయ్య లింగం చెరువుకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే  కలెక్టర్‌తో సహ ఉన్నతాధికారులు చెరువును అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి పలు  నివేదికలు పంపారు. ఈ పరిణామాల క్రమంలో వీజీటీఎం ఉడా అధికారులు మరో అడుగు మందుకేసి చెరువును  అప్పగిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరో హుస్సేన్‌సాగర్‌లా మారుస్తామని ప్రభుత్వానికి నివేదించి దీనికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.

    సుమారు 200 కోట్ల నిర్మాణ వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని దీనికి గానూ మొదటి విడతగా రూ.50 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి నివేదించారు. తాత్కలిక రాజధానిగా విజయవాడను ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు అన్ని గన్నవరంలోని మేథాటవర్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆ సమీపంలోనే ఉన్న చెరువును అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దటానికి ఉడా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
     
    జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి చెరువుల్లో బ్రహ్మయ్యలింగం చెరువు ఒకటి. 1064 ఎకరాల విస్తీర్ణంలో చెరువు రెండు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉంది. గన్నవరం మండలంలోని చిక్కవరం, మెట్లపల్లి గ్రామాల్లో 700 ఎకరాల పరిధిలో, అగిరిపల్లి మండలంలోని నర్సింగపాలెం, సగ్గూరు,తోటపల్లి గ్రామాల్లో 364 ఎకరాల్లో చెరువు ఉంది. చెరువు నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం చిన్ననీటిపారుదల శాఖ పర్యవేక్షిస్తుంది. రెండు మండలాల్లోని 10 గ్రామాల్లో ఉన్న సుమారు 5వేల ఎకరాల అయకట్టుకు  నీరందుతుంది. నాగార్జున సాగర్ ఎడమకాల్వ నుంచి అగిరిపల్లి సమీపంలో ఉన్న కుంపిణీ వాగు ద్వారా చెరువకు నీరు చేరుతుంది.

    ఈక్రమంలో ఈ చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు పలు శాఖల్లో ఉన్నాయి. జిల్లాలో కొత్త ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన 16 అభివృద్ధి పనులపై  కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు గత జూన్ నెలలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. నివేదికలో చెరువును తక్షణ మరమ్మతులు చేయాలని కోరారు. ఆ తర్వాత జరిగిన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా  చెరువును అభివృద్ధి చేయటానికి కసరత్తు చేస్తామని ఇటీవల ప్రకటించారు.

    అయితే చిన్న నీటిపారుదల శాఖ అధీనంలో ఉన్న చెరువును అభివృద్ధి చేయాలని నీటిపారుదల శాఖ, ఉడా అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వీజీటీఎం ఉడా అధికారులు అభివృద్ధికి సగమ్ర ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడుకు అభివృద్ధి పనులు ప్రతిపాదనలు అందజేసి నిధులు మంజూరుకు సహకరించాలని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి కోరారు.
     
    రూ. 50 కోట్లివ్వండి

    చెరువును నాలగు విడతల్లో అభివృద్ధి చేస్తామని దీనికి సుమారు 200 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశామని, తొలివిడతలో అభివృద్ధి పనులకు రూ 50 కోట్లు మంజూరు చేయాలని వీజీటీం ఉడా అధికారులు  కోరగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందిచారు. దీనిని హుస్సేన్‌సాగర్‌లా తీర్చిదిద్దాలని అధికారులు సూచించి సహకారం అందిస్తామని చెప్పారు.

    తొలిదశలో చెరువును పూర్తిస్థాయిలో పూడిక తీయించటం, చెరువు చుట్టూ భారీ ప్రహరీ గోడ నిర్మించటం చేస్తారు. అలాగే చెరువులో బోటింగ్ ఏర్పాటు, రిక్రియేషన్ కోసం పలు అధునాతన ఏర్పాటు చేయటం వంటి కార్యక్రమాలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నిధులు మంజూరు కాగానే టెండర్లు ఆహ్వనించి పనులు మొదలుపెట్టడానికి అన్ని ఏర్పాటు చేశారు.

    రానున్న రోజుల్లో విజయవాడ శాశ్వత రాజధాని అయితే ప్రజలకు పర్యాటక కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా దీనిని అభివృద్ధి చేయడానికి ఉడా ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతోపాటు ఉడా పరిధిలోని రెండు జిల్లాలో 7 చెరువుల్ని అభివృద్ధి చేయాలని ఉడా ప్రణాళికలు తయారుచేసింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement