హెచ్‌ఎండీఏలో పౌరసేవలు | Hyderabad Metro Development Authority with in the public quick | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏలో పౌరసేవలు

Published Mon, Oct 14 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

Hyderabad Metro Development Authority with in the public quick

భువనగిరి, న్యూస్‌లైన్ : హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలోని ప్రజలకు సత్వర సేవలందించేందుకు తార్నాకలోని ప్రధాన కార్యాలయంలో కొత్తగా పౌరసేవల కేంద్రాన్ని (సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలు హెచ్‌ఎండీఏ కిందకు వస్తాయి. వీటి పరిధిలో మొత్తం 131 గ్రామాలున్నాయి. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఉన్న జోనల్ కార్యాలయ వ్యవస్థలో ప్రజలు తమ ప్రధాన పనులైన ప్లానింగ్ కోసం పడుతున్న అవస్థలతోపాటు అధికారులు, సిబ్బంది అవినీతిపై అనేక ఫిర్యాదులు రావడంతో హెచ్‌ఎండీఏ తాజాగా పౌరసేవల విభాగాన్ని  తార్నాకలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. రెండు నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు సత్వరం సేవలందించేందుకు ప్లానింగ్ విభాగం విధులు పునర్నిర్మాణం, కంప్యూటరైజేషన్‌పై ఇటీవల అధ్యయనం చేయించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, ఫిర్యాదుల మేరకు పౌరసేవల కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
 
 పధానంగా నిర్మాణాల అనుమతుల్లో జాప్యానికి తావులేకుండా జేపీఓ, ఏపీఓ, పీఓ, సీపీఓలను ఒక యూనిట్‌గా చేర్చి ఒకేచోట విధులు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులో ఏదైనా పత్రం (జీరాక్స్ కాపీ) మిస్ అయితే దానికి  హెచ్‌ఎండీఏనే బాధ్యత వహిస్తుంది. మొదట జేపీఓ లేదా ఏపీఓలు దరఖాస్తులను ప్రాసెసింగ్ చేసి వారంలోగా పై అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయా ఫైళ్లు ఎక్కడైనా ఆగితే ఎందుకు ఆగిందనే విషయం తెలుసుకుని వారిపై చర్యలు తీసుకునే అధికారం సీపీఓ స్థాయి అధికారికి ఇచ్చారు. కాగా ప్లానింగ్ విభాగాన్ని మొత్తం 5 యూనిట్‌లుగా విభజించారు. ఇందులో మాన్యువల్, అన్‌లైన్ సేవలు అందిస్తారు.
 
 జోనల్ ఆఫీసర్లకు టాటా...!
 జోనల్ అధికారులను తప్పించి వారి సేవలను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలోని కీలక విభాగాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘట్‌కేసర్ జోనల్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. భూములకు సంబంధించిన వివాదాలను త్వరగా పరిష్కరించే ఉద్దేశంతో జోనల్ అధికారులుగా రెవెన్యూ శాఖకు చెందిన  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. జోనల్ కార్యాలయాలు ఉన్నప్పటికీ అక్కడ ఏపీఓ, జేపీఓల ద్వారా దరఖాస్తులను స్వీకరించి, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వీటిలో భవన నిర్మాణంలో అతిక్రమణలుంటే ఏపీఓ, జేపీఓలు గ్రామ పంచాయతీల ద్వారా నోటీసులు ఇప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తద్వారా ఎలాంటి జాప్యానికి, అవినీతికి తావులేకుండా చూడాలన్నదే హెచ్‌ఎండీఏ ఉద్దేశంగా కన్పిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement