సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నియంత్రణ కోసం ఓవైపు రోడ్లెక్కి పోలీసులు విధులు నిర్వహిస్తుంటే.. మరోవైపు కొందరు జనాలు మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని మొత్తుకుంటున్నా వినడం లేదు. మరోవైపు బయటకు వచ్చి నిబంధనలు సైతం పాటించడం లేదు. కొందరు మాస్కులు ధరించడం లేదు. కొందరు రోడ్లపై ఉమ్మి వేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. బైకులపై ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు అటకెక్కుతాయని పోలీసులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి అని చెబుతున్న పోలీసులనే కొందరు ఎదురించడం, ఆపై అసభ్యకరంగా మాట్లాడడం, చివరకు చేయి చేసుకునేంత వరకు వెళుతున్నారు. ఇలా లాక్‌డౌన్ కాలంలో రాచకొండలో ఉమ్మివేసిన వారిపై 20 కేసులు, పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వారిపై 8 కేసులు, సైబరాబాద్‌లో ఉమ్మివేసిన వారిపై 30 కేసులు, పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వారిపై 29 కేసులు నమోదయ్యాయి. అయితే అధికారికంగా ఇన్ని కేసులు నమోదైనా, అనధికారికంగా వందల మందికి పోలీసులు బుద్ధిచెప్పి పంపించారు.
ఏప్రిల్ 11.. మధ్యాహ్నం 12 గంటలు
సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని చంపాపేటలోని ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో యాకుత్‌పూర నుంచి బాలాపూర్ ఎక్స్ రోడ్డుకు వెళుతున్న ఓ వ్యక్తి చెక్‌పోస్టు వద్ద ఆపిన సమయంలో రోడ్డుపైనే ఉమ్మి వేశాడు. పోలీసులు వివరాలు అడగగా యాకుత్‌పురకు చెందిన అజ్గర్ అహ్మద్‌గా చెప్పాడు. ఆ వెంటనే అతడిపై ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.
‘ఏప్రిల్ 21... రాత్రి 8.40 గంటలు
పెట్రోలింగ్ మొబైల్ ఇన్‌చార్జ్‌గా హెడ్‌కానిస్టేబుల్ ఎ.నర్సింహులు ఎస్‌పీవో సురేష్‌తో కలిసి విధుల్లో ఉన్నాడు. రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మాస్క్ ధరించకుండా రోడ్లపైనే కనిపించాడు. అతడిని పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వబోగా బూతుల పురాణం మొదలెట్టాడు. ఆ వెంటనే విషయాన్ని నర్సింహ్ములు మల్కాజ్‌గిరి ఎస్‌ఐ హరీష్‌కు ఫిర్యాదు చేయడంతో పీవీఎన్ నగర్‌లోని ఆదిత్య ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఇంటి నుంచి బయటకు వస్తూ పోలీసులను అసభ్యకరంగా తిట్టాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. కావాలనే తమ విధులకు అటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించడంతో కేసు నమోదుచేశారు.
ఉమ్మివేస్తే ఊరుకునేది లేదు...
కరోనా వైరస్ నియంత్రణ కోసం అమల్లోకి తెచ్చిన యాక్ట్ ప్రకారం రోడ్లపై ఉమ్మివేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. అలా ఉమ్మి వేయడం వల్ల అందులో వైరస్ ఉంటే ఇతరులకు అంటుకునే ప్రమాదముంది. మాస్క్ ధరించకున్నా వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే రోడ్లపైకి వస్తున్న వారు ఉమ్మి వేసినా, పోలీసులతో అమర్యాదగా వ్యవహరించినా కేసులు నమోదుచేస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నాం.– మహేష్ భగవత్, వీసీ సజ్జనార్
Comments
Please login to add a commentAdd a comment