నేనూ గోదావరి బిడ్డనే
ఏలూరు : ‘నేనూ గోదావరి బిడ్డనే. మా సొంతూరు తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం. గోదావరి ఒడ్డునే ఉంటుంది. చిన్నప్పుడు ఏటిగట్టుపై ఆడుకునేవాళ్లం. గోదావరి నీళ్లలో స్నానం చేసేవాళ్లం. అందుకే నాకు గోదావరి అన్నా.. గోదావరి ప్రాంతమన్నా ఎంతో ఇష్టం. ఇప్పటివరకూ రెండుసార్లు గోదావరిలో పుష్కర స్నానం చేశాను. ఈసారి పుష్కరాల్లోనూ పుణ్యస్నానం ఆచరిస్తాను’ అన్నారు సినీ నటుడు కారెంకి ఫణికాంత్.
జంగారెడ్డిగూడెంలో ఉంటున్న స్నేహితుల ఇంటికి మంగళవారం వచ్చిన ఫణికాంత్ విలేకరులతో ముచ్చటించారు. గోదావరి నదితో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కారెంకి శ్రీరామ్మూర్తి కోరిక మేరకు సినీ రంగంలో ప్రవేశించానని చెప్పారు. తాను పుట్టిన ఊరు వేగేశ్వరపురం అయినప్పటికీ చదువు మాత్రం కొయ్యలగూడెంలో సాగిందన్నారు.
తన తండ్రి కొయ్యలగూడెంలో వీడీవోగా ఉద్యోగం చేయడం వల్ల తమ కుటుంబం అక్కడ స్థిరపడాల్సి వచ్చిందన్నారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో తనకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారని, అందరం ఏటా ఒకసారి కలుస్తుంటామని వివరించారు.
80 సినిమాల్లో నటించా
13 సంవత్సరాల క్రితం తాను సినీ రంగ ప్రవేశం చేశానని ఫణికాంత్ చెప్పారు. ఇప్పటివరకు 80 సినిమాల్లో నటించానన్నారు. మరో 12 సినిమాల్లో అవకాశం వచ్చిందన్నారు.