విభజన తీరు అభ్యంతరకరం: బాబు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుజాతి మధ్య కాంగ్రెస్ ద్వేషం రగిల్చి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, కాంగ్రెస్ కుట్రను జాతికి తెలియజెప్పడానికే తాను దీక్ష చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. విభజన తీరు అభ్యంతరకరమని, నీతిమాలిన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పెద్దలు, కేంద్రప్రభుత్వ ముఖ్యులు తలోమాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. ఇటు టీఆర్‌ఎస్, అటు వైఎస్సార్‌సీపీకి ఓట్లు మళ్లడం కోసం కాంగ్రెస్ విభజన నిర్ణయంతో ముందుకెళ్తోందని, ఈ మూడు పార్టీలు కలిసి నాటకమాడుతూ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు.
ఆదివారం ఢిల్లీలో రాంమనోహర్ లోహియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఆసుపత్రి ప్రాంగణంలోనే బాబు విలేకరులతో మాట్లాడారు. తనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారని, ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారన్నారు. తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయస్థాయిలో అన్ని పార్టీల నేతలకు చెప్పాలనే దీక్ష చేశానన్నారు. ‘ఓ చిన్న ఊళ్లో పార్టిషన్ చేసినా సమన్యాయం ఉండేలా చూస్తారు. రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డ కాంగ్రెస్ అలా సమన్యాయం చేశాకే ముందుకెళ్లాలి’ అని కోరారు. న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు.
హైదరాబాద్ చేరుకున్న బాబు: ఆదివారం సాయంత్రం చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి వెళ్లారు. అక్కడ ఇన్‌పేషెంట్‌గా చేరి రెండ్రోజుల పాటు చికిత్స పొందుతారని మీడియాకు పంపిన సమాచారం లో పార్టీ మీడియా కమిటీ చైర్మన్ శివరామకృష్ణ తెలిపారు.
జంతర్‌మంతర్ వద్ద టీడీపీ ధర్నా
ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ధర్నా వద్ద టీడీపీ ఎంపీ కె.నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ ఇరు ప్రాంతాలకు చెందిన అన్ని సంఘాలను పిలిపించి మాట్లాడి ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించాలని, లేకుంటే కాంగ్రెస్‌కు సమాధి కట్టడం ఖాయమని చెప్పారు.