అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి రాలేదు
- బ్లాక్‌మెయిల్ చేసే మనస్తత్వం ఎమ్మెల్యే సంజీవయ్యకు లేదు
- వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం
సూళ్లూరుపేట: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను బ్లాక్ మొయిల్ చేశారని, అవినీతి సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారని టీడీపీ మండల అధ్యక్షుడు, న్యాయకోవిదులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి విమర్శించడం గురువింద సామెతను తలపింపజేస్తుందని వైఎస్సార్‌సీపీ నేత దబ్బల రాజారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు కిలివేటిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు.
ప్రజావిశ్వాసం కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోయిన పరసా వెంకటరత్నయ్య జన్మదిన వేడుకలకు నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా విధులకు డుమ్మాకొట్టి పాల్గొనడం ఏ రాజ్యాంగంలో ఉందో? న్యాయకోవిదులైన సుధాకర్‌రెడ్డి చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అధికారం ఉందని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రొటోకాల్ పాటించకుండా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం తప్పుకాదా అని ప్రశ్నించారు. తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఎంపీపీ షేక్ షమీమ్, నలుబోయిన రాజసులోచనమ్మ, గండవరం సురేష్‌రెడ్డి, సుల్తాన్‌బాషా, రఘు, మురుగన్, గోగుల తిరుపాలు, వార్డు కౌన్సిలర్లు నలుబోయిన చిట్టిబాబు, ఉమ్మిటి జానకీరామ్, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
దళిత వ్యతిరేకి పరసానే:
సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా 15ఏళ్ల పాటు పని చేసిన పరసా ఏనాడైనా దళితులకు మేలు చేశారా అని వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు, మండల ఉపాధ్యక్షు డు శ్రీహరికోట చెంగయ్య, కౌన్సిలర్ పాలా మురళి ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే కిలివేటి దళితులందరినీ కలుపుకుని పోతుంటే ఆయనను దళిత వ్యతిరేకి అని ఎలా అంటారని ప్రశ్నించారు. సుధాకర్‌రెడ్డి లాంటి వ్యక్తులు లేనిపోని ఆరోపణలతో విమర్శలు చేస్తే తగిన రీతిలో ఆయనకు సమాధానం చెబుతామని హెచ్చరించారు. కౌన్సిలర్లు ముత్తుకూరు లక్ష్మమ్మ, పేర్నాటి దశయ్య, తొప్పాని మధు, గునిశెట్టి చిరంజీవి, వాటంబేటి నాగయ్య, ముత్తుకూరు రవి పాల్గొన్నారు.