నేను కరెక్ట్... కాదు నేనే !
- పోలీసుస్టేషన్ చేరిన భార్యాభర్తల గొడవ
చౌడేపల్లె: మొదటి పెళ్లి విషయం దాచిపెట్టి తనతో తాళి కట్టించుకుని మోసం చేసిందని భర్త.. తాను అన్ని విషయా లు పెళ్లికి ముందే చెప్పానని, ఇప్పుడు తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని భార్య ఇద్దరూ సోమవారం చౌడేపల్లె పోలీసులను ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నా యి.
సోమల మండలం కామిరెడ్డిపల్లెకు చెందిన ఉత్తన్న కుమార్తె రేఖాప్రసన్న అలియాస్ శిరీష తిరుపతిలో చదువుకున్నారు. అదే మండలం పేటూరుకు చెందిన వెంకటరమణకుమారుడు నగేష్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో మొబైల్‌కు వచ్చిన మిస్డ్ కాల్ ద్వారా ఇరువురూ స్నేహితులయ్యారు. వారిస్నేహం ముదిరి ప్రేమగా మారింది. ఇద్దరూ హైదరాబాదులో ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.
చౌడేపల్లె మండలంలోని లద్దిగం గ్రామానికి చెందిన నగేష్ బంధువులు వీరిని చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ ఉన్న నగేష్ భార్య రేఖా ప్రసన్న అలియాస్ శిరీషాను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు రమేష్ ఇదివరకే శిరీషను వివాహం చేసుకున్నాడన్న విషయాన్ని నగేష్‌కు బంధువులు తెలిపారు. దీంతో అతను గ్రామానికి వెళ్లి విచారించానని, రమేష్‌తో వివాహం జరిగిన విషయం నిజమని తేలిందని నగేష్ ఆరోపిస్తున్నాడు.
మొదటి వివాహ విషయం దాచి పెట్టి తనను మోసం చేసిం దని గ్రామపెద్దల సహకారంతో నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ముందే పెళ్లి జరిగిందన్న విషయాన్ని నగేష్ కు చెప్పానని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతనే దాచి పెట్టాడని, ఇప్పుడు అందిరికీ తెలిసాక తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని రేఖాప్రసన్నఅలియాస్ శిరీష వాపోయారు. భర్త నగేష్ తనకు కావాలని శిరీష పట్టుబడుతున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.