కొత్త రాజధానికి ఆశీస్సులివ్వాలని ప్రార్థించా
సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ఆశీస్సులివ్వాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాది పాలన సమర్థవంతంగా సాగిందన్నారు. ఈ వారంలోనే నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇదొక కీలక పరిణామమని చెప్పారు. ఇందుకు శ్రీవారు కూడా సంపూర్ణమైన ఆశీస్సులు అందిస్తారన్నారు.