మంత్రి కోరింది... ఒక్కరోజు.. | Assembly In Thursday talk on Call Money sex racket | Sakshi
Sakshi News home page

మంత్రి కోరింది... ఒక్కరోజు..

Published Fri, Dec 18 2015 3:36 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

మంత్రి కోరింది... ఒక్కరోజు.. - Sakshi

మంత్రి కోరింది... ఒక్కరోజు..

స్పీకర్  సస్పెండ్ చేసింది రెండు రోజులు!
సాక్షి, హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై అసెంబ్లీలో గురువారం చర్చకు పట్టుబడుతూ నిరసన తెలిపిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో బి.శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండురోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానంలో మాత్రం ఒక రోజే అని పేర్కొన్నా ఎమ్మెల్యేలపై స్పీకర్ రెండు రోజుల సస్పెన్షన్‌ను విధించడం గమనార్హం.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజే అధికార పక్షం ముందస్తు వ్యూహంతో ఈ చర్యకు దిగింది. స్పీకర్ కంటే ముందే చీఫ్ విప్, శాసనసభ వ్యవహారాల మంత్రి పదేపదే హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత స్పీకర్ వారి పేర్లను ప్రస్తావించడం, ఆ వెంటనే తీర్మానం, సస్పెన్షన్ చకచకా జరిగిపోయాయి.
 
ఇలా మొదలైంది...

రెండో సారి వాయిదా అనంతరం తిరిగి 12.14 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమైన వెంటనే కాల్ మనీపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇంతలో సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు, మంత్రి యనమల, జి.సూర్యారావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై అవాకులు, చెవాకులు పేలారు.

ఈ దశలో స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నడిచింది. సభలో నినాదాలు మిన్నంటడంతో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని గందరగోళం నెలకొంది. అప్పుడు యనమల జోక్యం చేసుకుంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తామని బెదిరించారు. ఈ దశలో ప్రతిపక్ష సభ్యులు ‘సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
 
ఒక రోజా, రెండ్రోజులా?
ఈ గొడవ మధ్యలోనే మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సభలో కెమెరాలకు ఆటంకం కలిగించినందుకు బి.శివప్రసాదరెడ్డి, డి.రామలింగేశ్వరరావును ఒక రోజు పాటు సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. దీన్ని స్పీకర్ మూజువాణీ ఓటుతో ఆమోదింపజేస్తూ ఆ ఇద్దర్నీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అధికారపక్షం తీరుతో ప్రతిపక్ష సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ కోడెల మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు.
 
తీర్మానానికి విరుద్ధంగా స్పీకర్ సస్పెండ్ చేయవచ్చా?
శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల స్పష్టంగా ఒక్కరోజు సస్పెండ్ చేయమని తీర్మానాన్ని ప్రతిపాదిస్తే స్పీకర్ మాత్రం రెండు రోజులు చేయడం వివాదాస్పదమైంది. సభా నిబంధనల ప్రకారం సంబంధిత మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, స్పీకర్ చర్చకు పెట్టి ఓటింగ్ నిర్వహించడం మాత్రమే చేయాలి. కానీ, గురువారం సభలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని ఆక్షేపించినా స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి వివరణ లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement