Minister Yanamala Rama Krishnudu
-
యనమల వియ్యంకుడికి రూ.38.98 కోట్ల నజరానా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు రూ.38.98 కోట్లను నజరానాగా ప్రభుత్వం ఇచ్చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలోని ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను 2016 నవంబర్ 30న పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన హెచ్‌ఈఎస్–పీఎస్కే సంస్థకు నిబంధనలను తుంగలో తొక్కుతూ నామినేషన్ విధానంలో కట్టబెట్టేసింది. అప్పట్లో అదే ధరలకు పనులు పూర్తి చేస్తామని అంగీకారపత్రం ఇచ్చిన సంస్థకే మంగళవారం అదనంగా రూ.38.98 కోట్లను చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ), ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) కమిటీల అభ్యంతరాలను సైతం తోసి పుచ్చడం గమనార్హం. అనుభవం లేని సంస్థకు పనులా? పీఎస్కే సంస్థకు సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పనులు చేసిన అనుభవం లేదు. తన వియ్యంకుడిని సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్‌గా మార్చేందుకు మంత్రి యనమల నడుం బిగించారు. తన సన్నిహితులకు చెందిన హెచ్‌ఈఎస్ సంస్థతో వియ్యకుండి సంస్థను కలిపి జాయింట్ వెంచర్(జేవీ) ఏర్పాటు చేశారు. అధికార బలాన్ని వినియోగించి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల్లో ఐదో ప్యాకేజీ(93.70 కి.మీ. నుంచి 111.487 కి.మీ. వరకూ లైనింగ్సహా కాలువ పనులు)కాంట్రాక్టర్‌పై 60సీ నిబంధన కింద వేటు వేయించారు. అందులో మిగిలిపోయిన.. అంటే 5.754 కి.మీ.ల కాలువ తవ్వకం, 11.001 కి.మీ.ల లైనింగ్, కాజ్ వే, బ్రిడ్జ్ వంటి కాంక్రీట్ నిర్మాణ పనులను ‘హెచ్‌ఈఎస్–పీఎస్కే’కు నామినేషన్ విధానంలో అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ పనుల విలువను రూ.142.88 కోట్లగా లెక్కగట్టిన ఎస్ఎల్ఎస్సీ, ఐబీఎం కమిటీలు ఏమాత్రం అనుభవం లేని సంస్థకు నామినేషన్‌పై పనులు అప్పగించే ప్రతిపాదనను తప్పుబట్టాయి. వాటిని బేఖాతరు చేస్తూ ఆ పనులను నామినేషన్ విధానంలో ఆ సంస్థకు అప్పగిస్తూ 2016 నవంబర్ 30న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను రూ.142.88 కోట్లతోనే పూర్తి చేసేందుకు ఆమోదం తెలుపుతూ హెచ్‌ఈఎస్–పీఎస్కే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ‘అంగీకార పత్రం’ కూడా ఇచ్చింది. పనులు చేతికి దక్కాక అదనపు నిధులు ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి యనమల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తాము చేసిన పనులకు అదనంగా రూ.38,98,61,783 ఇవ్వాలని మే 1న ఇంజనీర్–ఇన్–చీఫ్(ఈఎన్సీ)కు వినతిపత్రం ఇచ్చింది. ఆ మేరకు ఆ సంస్థకు అదనపు నిధులు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపాలంటూ ఆర్థిక మంత్రి యనమల ఒత్తిడి తెచ్చారు. కాంట్రాక్టరే రూ.142.88 కోట్లకే పనులు పూర్తి చేస్తామంటూ అంగీకారపత్రం ఇచ్చి, ఇప్పుడు అదనంగా నిధులు ఇవ్వాలని కోరడంపై ఎస్ఎల్ఎస్సీ, ఐబీఎం కమిటీలు నివ్వెరపోయాయి. అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపాయి. కానీ, ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు లొంగిన అధికారులు ఆ సంస్థకు అదనంగా రూ.38.98 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ గత మే 6న సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. అధికార బలాన్ని వినియోగించిన మంత్రి యనమల ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేలా చక్రం తిప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మంత్రిని నిలదీసిన ఎమ్మెల్యే సురేష్
చీమకుర్తి రూరల్: అసెంబ్లీలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పలు ప్రశ్నలతో ఆర్ధికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడిని నిలదీశారు. 2014 జూన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని..? వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు ఏమిటి..? ఆయా పెట్టుబడుల ద్వారా కల్పించబడిన ఉపాధి, తద్వారా ప్రభుత్వానికి అందిన ఇతర ప్రయోజనాలేమిటని ఎమ్మెల్యే సురేష్ ఆర్ధికశాఖా మంత్రిని ప్రశ్నించారు. దానికి మంత్రి యనమల సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు 1168 ఒప్పందాలు చేసుకున్నామని, వాటి ద్వారా రూ.2,65,015 కోట్ల విలువ చేసే ఒప్పందాలను చేసుకున్నట్లు చెప్పారు. ఆయా ఒప్పందాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. దానిపై ఎమ్మెల్యే సురేష్ అనుబంధ ప్రశ్నల్లో భాగంగా ఒప్పందంలో వివిధ దశలలో అనే పదంలో స్పష్టత లేదన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్ధలకు భూసేకరణ జరిగిందా..? వాటికి అనుమతులు మంజూరయ్యాయా..? వాటిలో ఎన్నిటికి శంకుస్థాపనలు చేశారు..? యంత్రసామగ్రిని ఎన్నిటికి బిగించా రు..? ఉత్పత్తిని ప్రారంభించనవి ఎన్నని మంత్రిని ఇరకాటంలో పడేలా ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని రాష్ట్రప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, చేసుకున్న ఒప్పందాలలో కేవలం 10 శాతం మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయని, దాదాపు 70 శాతం సంస్థలకు డీపీఆర్ కూడా తయారు చేయలేదనే వాస్తవాలను అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే సురేష్ ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 48 శాతం కార్యరూపం దాల్చాయని ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని సభముందుంచారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విస్తరణలను కూడా రాష్ట్రప్రభుత్వం లెక్కలో సాధించినట్లుగా చూపించటమేంటని ప్రశ్నించగా వాటిలో కూడా ముఖ్యమంత్రి చొరవ ఉందిగదాని మంత్రి సమర్ధించుకునే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. -
రాష్ట్ర బడ్జెట్ రూ.1,35,700 కోట్లు!
నేడు అసెంబ్లీలో 2016-17 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న యనమల సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2016-17) రూ.4,800 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోవడం ఇది 8వసారి కానుంది. ప్రణాళిక, ప్రణాళికేతరం కలపి మొత్తం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,700 కోట్లను వ్యయం చేయనున్నట్టుగా బడ్జెట్లో ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.49,200 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం రూ.86,500 కోట్లుగా చూపనున్నట్టు తెలుస్తోంది. ప్రణాళికేతర పద్దులోని కొన్ని కేటాయింపుల్ని ఈసారి ప్రణాళిక పద్దులోకి తేవడంద్వారా ప్రణాళిక వ్యయం సైజును పెంచారు. కాగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయానికే పురపాలక మంత్రి పి.నారాయణ శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు. యనమల రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం శాసనసభలో వ్యవసాయ మంత్రి పి.పుల్లారావు, శాసనమండలిలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 10.45కి మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. -
ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తోంది
బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, ఇక ముందు ఇలా జరిగితే సహించేది లేదని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సభలో తమకు మాట్లాడే అవకాశం రాకుండా ప్రభుత్వం కావాలనే అడ్డుపడుతోందని, గత శీతాకాల సమావేశాల్లో కూడా ఇదే తీరుగా వ్యవహరించారని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగంపై తాను బుధవారం సిద్ధమైతే శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చర్చను ముగిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారని, ఇది సరైన పద్ధది కాదన్నారు. దీనిపై సభలో ప్రస్తావిస్తే బడ్జెట్‌పై చర్చలో అవకాశం ఇస్తామన్నారని, ఏడాదికోసారి వచ్చే అవకాశాన్ని పోగొట్టి బడ్జెట్‌పై చర్చలో సమయం ఇస్తామంటే ఎలా నమ్మాలని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ప్రత్యక్ష ప్రసారాలను ఒకే సంస్థకు కట్టబెట్టడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
టార్గెట్.. ఆదాయం
-
టార్గెట్.. ఆదాయం
♦ చివరి త్రైమాసికంలో రూ.12,520 కోట్ల సాధన లక్ష్యం ♦ వివిధ శాఖలకు నిర్దేశించిన ఆర్థిక శాఖ ♦ రాబట్టాల్సిందేనని చెప్పనున్న మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వీలైనంత ఎక్కువగా ఆదాయం ఆర్జించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆదాయ వనరుల శాఖలకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత ఆదాయం సంపాదించాలో లక్ష్యాలను నిర్దేశించింది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా ఏకంగా రూ. 12,520 కోట్లను రాబట్టాలని ఆదేశాలిచ్చింది. ఇందులో వ్యాట్ ద్వారా అత్యధికంగా జనవరి నుంచి మార్చి వరకు రూ. 8,500 కోట్లు ఆర్జించాలని పేర్కొంది. వ్యాట్ ద్వారా డిసెంబర్ వరకు 21,232.43 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అంటే జనవరి నుంచి మార్చి వరకు మరో 8,500 కోట్ల రూపాయలను ఆర్జిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా మొత్తం 29,732.43 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అవుతుంది. మద్యం విక్రయాలు, రవాణా రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, ఇతర రంగాల ద్వారా ఈ ఆదాయం రాబట్టనున్నారు. ఈ లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోను సాధించి తీరాల్సిందిగా ఈ నెల 13న ఆయా శాఖలతో జరగునున్న సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేయనున్నారని తెలిసింది. కేంద్రం నుంచీ రాబడులు కేంద్ర పన్నుల వాటా రూపంలోను, అలాగే గ్రాంట్ల రూపంలోను, ఇతర కేంద్ర ప్రయోజిత పథకాల రూపంలో లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 41,620.23 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. అయితే డిసెంబర్ వరకు 30,476.78 కోట్ల రూపాయలు వచ్చాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరు నాటికి 11.642.35 కోట్ల రూపాయలు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. -
మార్చి తొలి వారంలో బడ్జెట్
ఫిబ్రవరి 29 లేదా మార్చి 1 నుంచి సమావేశాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 29 లేదా మార్చి 1వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసిన తరువాత మార్చి తొలి వారం చివరల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను 17 పనిదినాలతో ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వీలైనన్ని తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని చూడటం గమనార్హం. -
మంత్రి కోరింది... ఒక్కరోజు..
స్పీకర్ సస్పెండ్ చేసింది రెండు రోజులు! సాక్షి, హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై అసెంబ్లీలో గురువారం చర్చకు పట్టుబడుతూ నిరసన తెలిపిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యుల్లో బి.శివప్రసాదరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండురోజుల పాటు సస్పెండ్ చేశారు. అయితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానంలో మాత్రం ఒక రోజే అని పేర్కొన్నా ఎమ్మెల్యేలపై స్పీకర్ రెండు రోజుల సస్పెన్షన్‌ను విధించడం గమనార్హం. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజే అధికార పక్షం ముందస్తు వ్యూహంతో ఈ చర్యకు దిగింది. స్పీకర్ కంటే ముందే చీఫ్ విప్, శాసనసభ వ్యవహారాల మంత్రి పదేపదే హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత స్పీకర్ వారి పేర్లను ప్రస్తావించడం, ఆ వెంటనే తీర్మానం, సస్పెన్షన్ చకచకా జరిగిపోయాయి. ఇలా మొదలైంది... రెండో సారి వాయిదా అనంతరం తిరిగి 12.14 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమైన వెంటనే కాల్ మనీపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇంతలో సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు, మంత్రి యనమల, జి.సూర్యారావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై అవాకులు, చెవాకులు పేలారు. ఈ దశలో స్పీకర్‌కు వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నడిచింది. సభలో నినాదాలు మిన్నంటడంతో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని గందరగోళం నెలకొంది. అప్పుడు యనమల జోక్యం చేసుకుంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తామని బెదిరించారు. ఈ దశలో ప్రతిపక్ష సభ్యులు ‘సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒక రోజా, రెండ్రోజులా? ఈ గొడవ మధ్యలోనే మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సభలో కెమెరాలకు ఆటంకం కలిగించినందుకు బి.శివప్రసాదరెడ్డి, డి.రామలింగేశ్వరరావును ఒక రోజు పాటు సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు. దీన్ని స్పీకర్ మూజువాణీ ఓటుతో ఆమోదింపజేస్తూ ఆ ఇద్దర్నీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అధికారపక్షం తీరుతో ప్రతిపక్ష సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ కోడెల మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. తీర్మానానికి విరుద్ధంగా స్పీకర్ సస్పెండ్ చేయవచ్చా? శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల స్పష్టంగా ఒక్కరోజు సస్పెండ్ చేయమని తీర్మానాన్ని ప్రతిపాదిస్తే స్పీకర్ మాత్రం రెండు రోజులు చేయడం వివాదాస్పదమైంది. సభా నిబంధనల ప్రకారం సంబంధిత మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, స్పీకర్ చర్చకు పెట్టి ఓటింగ్ నిర్వహించడం మాత్రమే చేయాలి. కానీ, గురువారం సభలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ఆక్షేపించినా స్పీకర్ కార్యాలయం నుంచి ఎటువంటి వివరణ లేకపోయింది.