ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తోంది
బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, ఇక ముందు ఇలా జరిగితే సహించేది లేదని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సభలో తమకు మాట్లాడే అవకాశం రాకుండా ప్రభుత్వం కావాలనే అడ్డుపడుతోందని, గత శీతాకాల సమావేశాల్లో కూడా ఇదే తీరుగా వ్యవహరించారని గుర్తు చేశారు.
గవర్నర్ ప్రసంగంపై తాను బుధవారం సిద్ధమైతే శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చర్చను ముగిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారని, ఇది సరైన పద్ధది కాదన్నారు. దీనిపై సభలో ప్రస్తావిస్తే బడ్జెట్‌పై చర్చలో అవకాశం ఇస్తామన్నారని, ఏడాదికోసారి వచ్చే అవకాశాన్ని పోగొట్టి బడ్జెట్‌పై చర్చలో సమయం ఇస్తామంటే ఎలా నమ్మాలని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ప్రత్యక్ష ప్రసారాలను ఒకే సంస్థకు కట్టబెట్టడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.