మంత్రిని నిలదీసిన ఎమ్మెల్యే సురేష్
చీమకుర్తి రూరల్: అసెంబ్లీలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పలు ప్రశ్నలతో ఆర్ధికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడిని నిలదీశారు. 2014 జూన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని..? వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు ఏమిటి..? ఆయా పెట్టుబడుల ద్వారా కల్పించబడిన ఉపాధి, తద్వారా ప్రభుత్వానికి అందిన ఇతర ప్రయోజనాలేమిటని ఎమ్మెల్యే సురేష్ ఆర్ధికశాఖా మంత్రిని ప్రశ్నించారు.
దానికి మంత్రి యనమల సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు 1168 ఒప్పందాలు చేసుకున్నామని, వాటి ద్వారా రూ.2,65,015 కోట్ల విలువ చేసే ఒప్పందాలను చేసుకున్నట్లు చెప్పారు. ఆయా ఒప్పందాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. దానిపై ఎమ్మెల్యే సురేష్ అనుబంధ ప్రశ్నల్లో భాగంగా ఒప్పందంలో వివిధ దశలలో అనే పదంలో స్పష్టత లేదన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్ధలకు భూసేకరణ జరిగిందా..? వాటికి అనుమతులు మంజూరయ్యాయా..? వాటిలో ఎన్నిటికి శంకుస్థాపనలు చేశారు..? యంత్రసామగ్రిని ఎన్నిటికి బిగించా రు..? ఉత్పత్తిని ప్రారంభించనవి ఎన్నని మంత్రిని ఇరకాటంలో పడేలా ప్రశ్నలు సంధించారు.
ఇప్పటి వరకు రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని రాష్ట్రప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, చేసుకున్న ఒప్పందాలలో కేవలం 10 శాతం మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయని, దాదాపు 70 శాతం సంస్థలకు డీపీఆర్ కూడా తయారు చేయలేదనే వాస్తవాలను అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే సురేష్ ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 48 శాతం కార్యరూపం దాల్చాయని ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని సభముందుంచారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విస్తరణలను కూడా రాష్ట్రప్రభుత్వం లెక్కలో సాధించినట్లుగా చూపించటమేంటని ప్రశ్నించగా వాటిలో కూడా ముఖ్యమంత్రి చొరవ ఉందిగదాని మంత్రి సమర్ధించుకునే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే తెలిపారు.