MLA Suresh
-
చంద్రబాబు అవినీతిలో పవన్‌కు భాగం
విజయవాడ సిటీ: నాలుగేళ్ల పాటు చంద్రబాబుతో అంటకాగిన పవన్‌కల్యాణ్‌కూ ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిలో భాగం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ అవినీతిని ఎందుకు నిలదీయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రాజ్యాంగానికి సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షం రాజీలేని పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీల ఫిరాయింపులపై ఇన్నాళ్లూ మౌనం వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నత ఆశయాలతో పార్టీని స్థాపించి, 67 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపించుకున్న వైఎస్ జగన్ సామర్థ్యం గురించి పవన్‌కల్యాణ్ మాట్లాడటం అవివేకమని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లుగా కరువు, చేనేత కార్మికుల సమస్యలు, దళితుల మీద దాడులు, రాజధానిలో భూ కబ్జాలపై వైఎస్సార్సీపీ చేసిన పోరాటాలు జ్ఞాపకం లేదా అని పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులైన మాజీ చీఫ్ సెక్రటరీలు చంద్రబాబు లూటీ గురించి ప్రశ్నిస్తే వాటి గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికి పోయారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు కారులు కొనుగోలులో రూ. 500 కోట్లు కుంభకోణం జరిగిందని, అదే డబ్బు తెలంగాణలో జూపూడి పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. -
ఉద్యోగులపై కక్షసాధింపునకు పాల్పడుతున్న ప్రభుత్వం
= అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ చీమకుర్తి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. అందుకు రెండురోజుల క్రితం ఐపీఎస్ అధికారిపై రాజకీయ నాయకుల అనుచిత వైఖరే ఇందుకు నిదర్శనమని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి దుస్థితి మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్యోగులతో చట్టవ్యతిరేక పనులు చేయించుకుంటున్నారని, వారికి రావాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలను ఇంతవరకు చెల్లించలేదన్నారు. మెడికర్ రీయింబర్స్మెంట్ పేరుతో ప్రతి నెల వారి జీతాల్లో నుంచి కొంత సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుందని గుర్తు చేశారు. కానీ వారికి ఆస్పత్రుల్లో ఇంత వరకు సరైన వైద్యసదుపాయాలు లభించటం లేదని స్పీకర్ కోడెల దృష్టికి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే సురేష్ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి జిల్లాలో ఇంటి స్థలాలను ఇచ్చే ప్రతిపాదలను ఉన్నాయని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ మంత్రి ఇప్పుడు అలాంటి ప్రతిపాదనలేవి లేవని చెప్పటం ఉద్యోగులను అన్యాయం చేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. -
మంత్రిని నిలదీసిన ఎమ్మెల్యే సురేష్
చీమకుర్తి రూరల్: అసెంబ్లీలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పలు ప్రశ్నలతో ఆర్ధికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడిని నిలదీశారు. 2014 జూన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని..? వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు ఏమిటి..? ఆయా పెట్టుబడుల ద్వారా కల్పించబడిన ఉపాధి, తద్వారా ప్రభుత్వానికి అందిన ఇతర ప్రయోజనాలేమిటని ఎమ్మెల్యే సురేష్ ఆర్ధికశాఖా మంత్రిని ప్రశ్నించారు. దానికి మంత్రి యనమల సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు 1168 ఒప్పందాలు చేసుకున్నామని, వాటి ద్వారా రూ.2,65,015 కోట్ల విలువ చేసే ఒప్పందాలను చేసుకున్నట్లు చెప్పారు. ఆయా ఒప్పందాలు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. దానిపై ఎమ్మెల్యే సురేష్ అనుబంధ ప్రశ్నల్లో భాగంగా ఒప్పందంలో వివిధ దశలలో అనే పదంలో స్పష్టత లేదన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్ధలకు భూసేకరణ జరిగిందా..? వాటికి అనుమతులు మంజూరయ్యాయా..? వాటిలో ఎన్నిటికి శంకుస్థాపనలు చేశారు..? యంత్రసామగ్రిని ఎన్నిటికి బిగించా రు..? ఉత్పత్తిని ప్రారంభించనవి ఎన్నని మంత్రిని ఇరకాటంలో పడేలా ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని రాష్ట్రప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, చేసుకున్న ఒప్పందాలలో కేవలం 10 శాతం మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయని, దాదాపు 70 శాతం సంస్థలకు డీపీఆర్ కూడా తయారు చేయలేదనే వాస్తవాలను అసెంబ్లీ ముందు ఎమ్మెల్యే సురేష్ ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 48 శాతం కార్యరూపం దాల్చాయని ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని సభముందుంచారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విస్తరణలను కూడా రాష్ట్రప్రభుత్వం లెక్కలో సాధించినట్లుగా చూపించటమేంటని ప్రశ్నించగా వాటిలో కూడా ముఖ్యమంత్రి చొరవ ఉందిగదాని మంత్రి సమర్ధించుకునే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. -
ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
♦ అధికారులకు సభాహక్కుల కమిటీ హెచ్చరిక ♦ ఎమ్మెల్యే సురేశ్ ఫిర్యాదుతో విచారణ చేసిన కమిటీ సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని ఏపీ శాసనసభ హక్కుల(ప్రివిలేజ్) కమిటీ హెచ్చరించింది. సభ్యులను అవమానపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని స్పష్టం చేసింది. సోమవారం కమిటీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. సమావే శానికి కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొరుకొండ రామకృష్ణ, బీసీ జనార్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా రామతీర్థం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో అధికారులు తన హక్కులకు భంగం కలిగించారని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ (వైఎస్సార్సీపీ) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.దాన్ని స్పీకర్ హక్కుల కమిటీకి పంపారు.సోమవారం జరిగిన కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే సురేష్‌తో పాటు అప్పటి ఒంగోలు గ్రామీణ సీఐ రవికుమార్, చీమకుర్తి ఎస్ఐ నాగరాజు హాజరై తమ వాదనలు వినిపించారు.ఆ సందర్భంగా నిర్వహించిన సభకు తనను ఆహ్వానించి అందులో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా అధికారులు అవమానించారని, పోలీసులు ఆ సభలో పాల్గొనేలా రక్షణ కల్పించటంలో విఫలమయ్యారని కమిటీకి సురేష్ వివరించారు. అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యేలను వేదికపైకి ఆహ్వానించి సత్కరించారని, తనను కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడికి అనుమతించారని చెప్పారు. తరువాత తమ వాదన వినిపించిన పోలీసు అధికారులు.. ఎమ్మెల్యేను ఆహ్వానించినట్లు తమకు నీటిపారుదల శాఖ అధికారులు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కమిటీ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారైనా హక్కులకు భంగం కలిగేందుకు వీలులేదని స్పష్టం చేసింది. -
దళిత జాతి ముద్దు బిడ్డ అంబేద్కర్
మంద కృష్ణమాదిగ, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ నాగులుప్పలపాడు : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దళిత జాతి ముద్దు బిడ్డలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈదుమూడి గ్రామంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ దళిత జాతి ఉద్యమం పుట్టిన ఈ జిల్లాలోనే ఎమ్మార్పీఎస్ వంటి ఆత్మగౌరవ పోరాట ఉద్యమం కూడా పుట్టిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి పుట్టినిల్లయిన ఈదుమూడిలో వేలాది మంది సమక్షంలో మహానేతల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. దళితుల్లో అసమానతలను తొలగించేందుకు దళిత మేధావులు, దళిత ప్రజాప్రతినిధులు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పుట్టినిల్లు అయిన ఈదుమూడి చరిత్ర పుటల్లో నిలుస్తుందన్నారు. ముందుగా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు కృష్ణమాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్మ మాదిగ, ఒంగోలు రూరల్ సీఐ సంజీవకుమార్, నాగులుప్పలపాడు ఎస్సై హరిబాబు పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు బి.ఎన్.రమేష్ మాదిగ, శేషన్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ, జాతీయ అధికార ప్రతినిధులు కూచిపూడి సత్యం మాదిగ, రవికుమార్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధులు నరేంద్ర మాదిగ, మల్లవరపు నాగయ్య మాదిగ, మాదిగ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు చిలుమూరి శ్రీనివాస్ మాదిగ, ప్రకాశం జిలా ఇన్చార్జి ఏటుకూరి విజయ్‌కుమార్ మాదిగ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల అధ్యక్షులు వర్ల దేవదాసు మాదిగ, పెంచలయ్య మాదిగ, సుభాష్ మాదిగ, ఎగ్గిడి మల్లయ్య మాదిగ, కోట డానియేల్ మాదిగ, బీజేపీ జిల్లా నాయకులు నాగార్జున, తెలగతోటి చంద్రమోహన్ మాల, పాలడుగు రమేష్ మాల తదితరులు పాల్గొన్నారు.