♦ అధికారులకు సభాహక్కుల కమిటీ హెచ్చరిక
♦ ఎమ్మెల్యే సురేశ్ ఫిర్యాదుతో విచారణ చేసిన కమిటీ
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని ఏపీ శాసనసభ హక్కుల(ప్రివిలేజ్) కమిటీ హెచ్చరించింది. సభ్యులను అవమానపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని స్పష్టం చేసింది. సోమవారం కమిటీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. సమావే శానికి కమిటీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొరుకొండ రామకృష్ణ, బీసీ జనార్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ప్రకాశం జిల్లా రామతీర్థం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సమయంలో అధికారులు తన హక్కులకు భంగం కలిగించారని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ (వైఎస్సార్‌సీపీ) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.దాన్ని స్పీకర్ హక్కుల కమిటీకి పంపారు.సోమవారం జరిగిన కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే సురేష్‌తో పాటు అప్పటి ఒంగోలు గ్రామీణ సీఐ రవికుమార్, చీమకుర్తి ఎస్‌ఐ నాగరాజు హాజరై తమ వాదనలు వినిపించారు.ఆ సందర్భంగా నిర్వహించిన సభకు తనను ఆహ్వానించి అందులో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా అధికారులు అవమానించారని, పోలీసులు ఆ సభలో పాల్గొనేలా రక్షణ కల్పించటంలో విఫలమయ్యారని కమిటీకి సురేష్ వివరించారు.
అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యేలను వేదికపైకి ఆహ్వానించి సత్కరించారని, తనను కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడికి అనుమతించారని చెప్పారు. తరువాత తమ వాదన వినిపించిన పోలీసు అధికారులు.. ఎమ్మెల్యేను ఆహ్వానించినట్లు తమకు నీటిపారుదల శాఖ అధికారులు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కమిటీ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందిన వారైనా హక్కులకు భంగం కలిగేందుకు వీలులేదని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
Published Tue, Sep 29 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM
Advertisement