ఉద్యోగులపై కక్షసాధింపునకు పాల్పడుతున్న ప్రభుత్వం
= అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
చీమకుర్తి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. అందుకు రెండురోజుల క్రితం ఐపీఎస్ అధికారిపై రాజకీయ నాయకుల అనుచిత వైఖరే ఇందుకు నిదర్శనమని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి దుస్థితి మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్యోగులతో చట్టవ్యతిరేక పనులు చేయించుకుంటున్నారని, వారికి రావాల్సిన డీఏ, పీఆర్‌సీ బకాయిలను ఇంతవరకు చెల్లించలేదన్నారు. మెడికర్ రీయింబర్స్‌మెంట్ పేరుతో ప్రతి నెల వారి జీతాల్లో నుంచి కొంత సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుందని గుర్తు చేశారు. కానీ వారికి ఆస్పత్రుల్లో ఇంత వరకు సరైన వైద్యసదుపాయాలు లభించటం లేదని స్పీకర్ కోడెల దృష్టికి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే సురేష్ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి జిల్లాలో ఇంటి స్థలాలను ఇచ్చే ప్రతిపాదలను ఉన్నాయని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ మంత్రి ఇప్పుడు అలాంటి ప్రతిపాదనలేవి లేవని చెప్పటం ఉద్యోగులను అన్యాయం చేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు.