
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు రూ.38.98 కోట్లను నజరానాగా ప్రభుత్వం ఇచ్చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలోని ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను 2016 నవంబర్ 30న పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన హెచ్‌ఈఎస్–పీఎస్‌కే సంస్థకు నిబంధనలను తుంగలో తొక్కుతూ నామినేషన్ విధానంలో కట్టబెట్టేసింది. అప్పట్లో అదే ధరలకు పనులు పూర్తి చేస్తామని అంగీకారపత్రం ఇచ్చిన సంస్థకే మంగళవారం అదనంగా రూ.38.98 కోట్లను చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ), ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) కమిటీల అభ్యంతరాలను సైతం తోసి పుచ్చడం గమనార్హం.
అనుభవం లేని సంస్థకు పనులా?
పీఎస్‌కే సంస్థకు సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పనులు చేసిన అనుభవం లేదు. తన వియ్యంకుడిని సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్‌గా మార్చేందుకు మంత్రి యనమల నడుం బిగించారు. తన సన్నిహితులకు చెందిన హెచ్‌ఈఎస్ సంస్థతో వియ్యకుండి సంస్థను కలిపి జాయింట్ వెంచర్(జేవీ) ఏర్పాటు చేశారు. అధికార బలాన్ని వినియోగించి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల్లో ఐదో ప్యాకేజీ(93.70 కి.మీ. నుంచి 111.487 కి.మీ. వరకూ లైనింగ్‌సహా కాలువ పనులు)కాంట్రాక్టర్‌పై 60సీ నిబంధన కింద వేటు వేయించారు. అందులో మిగిలిపోయిన.. అంటే 5.754 కి.మీ.ల కాలువ తవ్వకం, 11.001 కి.మీ.ల లైనింగ్, కాజ్ వే, బ్రిడ్జ్ వంటి కాంక్రీట్ నిర్మాణ పనులను ‘హెచ్‌ఈఎస్–పీఎస్‌కే’కు నామినేషన్ విధానంలో అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ పనుల విలువను రూ.142.88 కోట్లగా లెక్కగట్టిన ఎస్‌ఎల్‌ఎస్‌సీ, ఐబీఎం కమిటీలు ఏమాత్రం అనుభవం లేని సంస్థకు నామినేషన్‌పై పనులు అప్పగించే ప్రతిపాదనను తప్పుబట్టాయి.
వాటిని బేఖాతరు చేస్తూ ఆ పనులను నామినేషన్ విధానంలో ఆ సంస్థకు అప్పగిస్తూ 2016 నవంబర్ 30న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను రూ.142.88 కోట్లతోనే పూర్తి చేసేందుకు ఆమోదం తెలుపుతూ హెచ్‌ఈఎస్–పీఎస్‌కే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ‘అంగీకార పత్రం’ కూడా ఇచ్చింది. పనులు చేతికి దక్కాక అదనపు నిధులు ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి యనమల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తాము చేసిన పనులకు అదనంగా రూ.38,98,61,783 ఇవ్వాలని మే 1న ఇంజనీర్–ఇన్–చీఫ్(ఈఎన్‌సీ)కు వినతిపత్రం ఇచ్చింది. ఆ మేరకు ఆ సంస్థకు అదనపు నిధులు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపాలంటూ ఆర్థిక మంత్రి యనమల ఒత్తిడి తెచ్చారు. కాంట్రాక్టరే రూ.142.88 కోట్లకే పనులు పూర్తి చేస్తామంటూ అంగీకారపత్రం ఇచ్చి, ఇప్పుడు అదనంగా నిధులు ఇవ్వాలని కోరడంపై ఎస్‌ఎల్‌ఎస్‌సీ, ఐబీఎం కమిటీలు నివ్వెరపోయాయి. అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపాయి. కానీ, ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు లొంగిన అధికారులు ఆ సంస్థకు అదనంగా రూ.38.98 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ గత మే 6న సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. అధికార బలాన్ని వినియోగించిన మంత్రి యనమల ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేలా చక్రం తిప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment