టార్గెట్.. ఆదాయం | Income Target | Sakshi
Sakshi News home page

టార్గెట్.. ఆదాయం

Published Mon, Jan 4 2016 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

టార్గెట్..  ఆదాయం

టార్గెట్.. ఆదాయం

♦ చివరి త్రైమాసికంలో రూ.12,520 కోట్ల సాధన లక్ష్యం
♦ వివిధ శాఖలకు నిర్దేశించిన ఆర్థిక శాఖ
♦ రాబట్టాల్సిందేనని చెప్పనున్న మంత్రి యనమల
 
 సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వీలైనంత ఎక్కువగా ఆదాయం ఆర్జించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆదాయ వనరుల శాఖలకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత ఆదాయం సంపాదించాలో లక్ష్యాలను నిర్దేశించింది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా ఏకంగా రూ. 12,520 కోట్లను రాబట్టాలని ఆదేశాలిచ్చింది. ఇందులో వ్యాట్ ద్వారా అత్యధికంగా జనవరి నుంచి మార్చి వరకు రూ. 8,500 కోట్లు ఆర్జించాలని పేర్కొంది. వ్యాట్ ద్వారా డిసెంబర్ వరకు 21,232.43 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది.

అంటే జనవరి నుంచి మార్చి వరకు మరో 8,500 కోట్ల రూపాయలను ఆర్జిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా మొత్తం 29,732.43 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అవుతుంది.  మద్యం విక్రయాలు, రవాణా రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, ఇతర రంగాల ద్వారా ఈ ఆదాయం రాబట్టనున్నారు. ఈ లక్ష్యాలను ఎట్టిపరిస్థితుల్లోను సాధించి తీరాల్సిందిగా ఈ నెల 13న ఆయా శాఖలతో జరగునున్న సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేయనున్నారని తెలిసింది.  

 కేంద్రం నుంచీ రాబడులు
 కేంద్ర పన్నుల వాటా రూపంలోను, అలాగే గ్రాంట్ల రూపంలోను, ఇతర కేంద్ర ప్రయోజిత పథకాల రూపంలో లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 41,620.23 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. అయితే డిసెంబర్ వరకు 30,476.78 కోట్ల రూపాయలు వచ్చాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరు నాటికి 11.642.35 కోట్ల రూపాయలు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement