- పుష్కర విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చెప్పుతో దాడి
- అధికారపార్టీ నాయకుల తీరుపై పోలీసుల ఆందోళన
రేపల్లె : పుష్కర విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కోడెల అనుచరులమంటూ కొంత మంది వ్యక్తులు దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లా పెనుమూడి ఘాట్ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పెనుమూడి-పులిగడ్డ వారధి సమీపంలో పుష్కరఘాట్‌కు వెళ్ళే మార్గంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద రెండు వాహనాలు వచ్చి ఆగాయి. ఈ దారిలో వాహనాలు వెళ్ళేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. హారతి మహోత్సవం ఇప్పుడే పూర్తి కావటంవల్ల భక్తులు పుష్కరఘాట్ నుంచి బయటకు వెళ్తున్నారని, వాహనాలను అడ్డు తీయాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన సదరు వాహనదారులు ‘కోడెల అనుచరులనే అడ్డగిస్తారా?’ అంటూ ఓ వ్యక్తి కానిస్టేబులును చెప్పుతో కొట్టాడు.
వాహనంలోని మిగిలిన వారు కూడా కిందికి దిగి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు కూడా వారిపై తిరగబడ్డారు. కొద్దిదూరంలో ఉన్న ఇతర పోలీసులు గొడవ విషయం తెలుసుకుని వచ్చి నచ్చచెప్పడంతో ఎటువారు అటు వెళ్ళిపోయారు. దాడిలో గాయపడిన కానిస్టేబులును వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఆదివారం సాయంత్రం ఘాట్ జరిగే హారతి ఉత్సవానికి కోడెల హాజరుకాగా, ఆ విషయం తెలుసుకుని అనుచరులు వచ్చినట్లు తెలిసింది. పుష్కరాల్లో రోజుకు 16 గంటలు విధి నిర్వహణలో నిమగ్నమవుతూ అలసిపోతున్న తమపట్ల అధికారపార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దాడి చేసిన వ్యక్తులు భృగబండ వాసులుగా గుర్తించాం: సీఐ
పోలీసులపై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన వ్యక్తులు సత్తెనపల్లి భృగబండ వాసులుగా గుర్తించినట్టు రేపల్లె టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు చెప్పారు. పెనుమూడి-పులిగడ్డ వారధి సమీపంలో భక్తులు రాకపోకలకు ఏర్పాటు చేసిన రహదారిలో వాహనాలను నిషేధించామని, ఇదేఅంశాన్ని పాటించిన పోలీసుపై చెప్పుతో దాడి చేయడం సరైన విధానం కాదన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీసులపై కోడెల అనుచరుల దౌర్జన్యం
Published Tue, Aug 23 2016 1:05 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement