‘ఐ క్లిక్’.. వేధింపులకు చెక్ | 'I click on the abuses of the check .. | Sakshi
Sakshi News home page

‘ఐ క్లిక్’.. వేధింపులకు చెక్

Published Mon, Dec 22 2014 9:17 AM | Last Updated on Mon, Aug 20 2018 1:46 PM

‘ఐ క్లిక్’.. వేధింపులకు చెక్ - Sakshi

‘ఐ క్లిక్’.. వేధింపులకు చెక్

  • ఏటీఎం కేంద్రాలే ఫిర్యాదు స్టేషన్లు
  • మహిళా బాధితుల కోసం ప్రత్యేక యంత్రాలు
  • కసరత్తు చేస్తున్న ఏపీ పోలీసు విభాగం
  • చదవురాని వారికి ‘మాటల సందేశం’ ఏర్పాటు
  • సాక్షి, హైదరాబాద్: మహిళలు, యువతుల భద్ర త కోసం ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకునే దిశలో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ‘ఐ క్లిక్’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పోలీసు కంప్యూటర్, సాంకేతిక సేవల విభాగం దీనికి అవసరమైన కసరత్తు చేస్తోంది. ఆపదలో ఉన్న, వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలని డీజీపీ కార్యాలయం భావిస్తోంది.

    ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలోనే ఈ మిషన్ల ఏర్పాటుపై ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన ఏటీఎం సెంటర్లు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీటిలో ఏటీఎం మిషన్లతో పాటు పోలీసులకు సంబంధించిన ‘ఐ క్లిక్’ ఫిర్యాదు యంత్రాలను ఏర్పాటు చేయాలన్నది ఉన్నతాధికారుల యోచన. బాధితులు తమ ఫిర్యాదుల్ని ఈ యంత్రంలో ఉండే ఓ మీటను నొక్కడం ద్వారా నమోదు చేయవచ్చు.

    ఇవి నేరుగా ‘డయల్-100’ కంట్రోల్‌రూమ్‌తో అనుసంధానించి ఉంటాయి. 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఫిర్యాదు సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసుస్టేషన్, గస్తీ బృందాలకు అందిస్తారు. ఫిర్యాదులోని అంశా లు, దాని తీవ్రత ఆధారంగా స్థానిక పోలీసులు, పెట్రోలింగ్ పార్టీలు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. పూర్తిస్థాయి జవాబుదారీతనం, పాదర్శకత కోసం ఈ మిషన్ల ద్వారా ఫిర్యాదు చేసిన వారికి రసీదు కూడా ముద్రితమై వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ తరహాకు చెందిన ఓ మిషన్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. అయితే అందులో బాధితులు తమ ఫిర్యాదును టైప్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో నివసించే వారికి ముఖ్యంగా మహిళలకు టైపింగ్‌పై అవగాహన ఉండదనే నేపథ్యంలో ఇక్కడి మిషన్లలో మీట ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు.

    దీంతో పాటు బాధితులు, సమాచారం ఇచ్చే వారు మాటల రూపంలోనూ(వాయిస్ మెసేజ్) వాటిని దాఖలు చేసేలా ఏర్పాట్లు చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందని ఆ సంస్థకు సూచించారు. ఏటీఎం కేంద్రాల్లో వీటి ఏర్పాటు, అవసరమైన విద్యుత్, ఆన్‌లైన్ కనెక్టివిటీ, నిర్వహణ సహకారం తదితర అంశాలపై  ఆయా బ్యాంకులతో సంప్రదింపులు జరపాలని పోలీసు విభాగం నిర్ణయించింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement