'ప్రపంచానికి పాఠాలు చెప్పాను...మీరెంత'
హైదరాబాద్ : 'ప్రపంచానికే పాఠాలు చెప్పాను.... మీ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు' అని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి లెక్కలు చెబుతానంటే ఒప్పుకొనేది లేదని ఆయన అన్నారు. తొలిసారి అసెంబ్లీకి వచ్చిన మీరు ఓపిక పట్టాలి అంటూ చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు.
చర్చపై బాబు మాట్లాడుతూ తొమ్మిదేళ్లు కరెంట్ కోసం ప్రతిరోజు గంట కేటాయించేవాడినని, మిగులు కరెంట్ సాధించిన ఘటన టీడీపీదేనని చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో రెండు శాతం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. తన హయాంలోనే కళాశాలలు వచ్చాయని, జాబు కావాలంటే బాబు రావాలన్న దాన్ని చేసి చూపిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా బాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే క్షమించాలని, తన ఉద్దేశం అది కాదని చంద్రబాబు అన్నారు.