‘దొంగలా వచ్చి చంద్రబాబు సభలో ప్రకటన’
అమరావతి : పదో తరగత ప్రశ్నపత్రాల లీకేజిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ చేత విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 6.50 లక్షల విద్యార్ధుల భవిష్యత్‌కు సంబంధించిన ఈ లీకేజిపై చర్చ జరపడానికి అవకాశం ఇవ్వడం లేదని, మంగళవారం దీనిపై సభలో పట్టుబడితే గురువారం ప్రకటన చేస్తామని చెప్పి విపక్షం లేని సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దొంగలా వచ్చి దీనిపై ప్రకటన చేయడంతోపాటు విలువైన బిల్లులను కూడా పాస్ చేయించుకున్నారని తెలిపారు.
ఈ ప్రశ్న పత్రాల లీకేజిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రకంగానూ, మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణలు వేర్వేరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఆ వార్త ఒక్క సాక్షి పత్రికలోనే ప్రచురితం కావడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా దానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాక్షి దినపత్రికలే కారణమంటూ ఆరోపణలు చేయడం టీడీపీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. సీఎం బినామీగా మంత్రి నారాయణ వ్యవహరిస్తుండటంతో ఆయనేం అక్రమాలకు పాల్పడినా చర్యలు ఉండటం లేవని ఆరోపించారు.