బాబు మీడియా పిచ్చే అమాయకుల ప్రాణాలు తీసింది!
పుష్కరాలలో తొక్కిసలాటపై సభలో చర్చ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా పిచ్చితోనే గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మరణించిన వారి కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం అందలేదని, ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదని సోమవారం ఏపీ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన సమాధానంపై జగ్గిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో 2015 జూలై 14న జరిగిన తొక్కిసలాటపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీవై సోమయాజులు నాయకత్వంలోని కమిటీ విచారణ జరుపుతోందని, త్వరలో నివేదిక వస్తుందని, ఈ పరిస్థితుల్లో సభలో చర్చించలేమని యనమల చెప్పారు. దీనిపై జగ్గిరెడ్డి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ విచారణ కమిటీకి జిల్లా కలెక్టర్ సీసీటీవీ ఫుటేజీ కూడా ఇవ్వలేదన్నారు. వీఐపీలకు కేటాయించిన ఘాట్లలో కాకుండా చంద్రబాబు పుష్కరఘాట్‌కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారని చెప్పారు. తొక్కిసలాటకు కారణం చంద్రబాబేనన్నారు. ఘాట్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నా సుమారు 90 వాహనాలు అక్కడకు చేరాయని వివరించారు. ఆ మేరకు ఫోటోలను కూడా సభలో ప్రదర్శించారు. చంద్రబాబు స్నానం చేసే ఘట్టాన్ని చిత్రీకరించడంతో పాటు పుష్కరాలపై డాక్యుమెంటరీ తీసేందుకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నానా హంగామా చేశారని, ఓ ప్రైవేటు వ్యక్తిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
తొక్కిసలాట ఘటనపై కమిషన్‌ను నియమించినా అటు జిల్లా కలెక్టర్ గానీ ఇటు ఇతర అధికారులు గానీ సహకరించడం లేదని, అటువంటప్పుడు ఈ కమిషన్‌తో ఏమి ప్రయోజనం ఉంటుందని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సార్లు సోమయాజులు కమిషన్ గడువును పొడిగించారని, ఇంకెంత కాలం సాగదీస్తారని నిలదీశారు. చంద్రబాబు మీడియా పిచ్చితో అనర్థం జరిగిందన్నప్పుడు సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య.. చంద్రబాబు తప్పేమీ లేదని, ప్రతిపక్ష సభ్యులు ప్రతి అంశానికీ వక్రభాష్యం చెబుతున్నారన్నారు. దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ తమ లెక్కల ప్రకారం 27 మందే చనిపోయారని, 50 మంది గాయపడ్డారని, అందరికీ ఆర్థిక సాయం అందించామని, ఇంకా ఎవరికైనా రాకుంటే వారి వివరాలను తన దృష్టికి తీసుకువస్తే అందిస్తామన్నారు.