చంద్రబాబు, పవన్‌కు ఆ ఆలోచనే లేదు: రోజా
అమరావతి: రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయాలపై వాయిదా తీర్మానాలు ఇస్తే అధికార పక్షం కొట్టిపారేసి సమస్యలకు పాతరేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా టీడీపీపై ధ్వజమెత్తారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో మొదటిరోజు నుంచి చివరిరోజు వరకు ప్రభుత్వం స్టేట్‌మెంట్‌లు ఇచ్చి తప్పించుకోవాలని చూసిందని, ఒక్క విషయంపైన కూడా సరైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు.
ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజి, ఆక్వా కంపెనీలో ఐదుగురి మృతి విషయాలపై వాయిదా తీర్మానాలు ఇస్తే పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని తిట్టడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారే తప్ప, ప్రజా సమస్యలపై తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. తమను తిట్టడానికే సమయం ఉపయోగించారని, ప్రజా సమస్యలపై నోరు మెదపలేదని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి విషయంలో చేసినట్లే మొగల్తూరు మృతుల విషయంలో కూడా సీఎం సెటిల్‌మెంట్ చేస్తున్నారని విమర్శించారు.
కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన వారిగురించి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. నాయకుల తప్పులను కప్పిపుచ్చేందుకు మాత్రం తెరపైకి వస్తున్నారన్నారు. కుందుర్రులో పెట్టబోయే ఆక్వా ప్రాజెక్టు గురించి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడితే మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకులంటూ విమర్శిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. నర్సాపురం, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో కొత్తగా పెట్టబోయే ఆక్వా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. స్వలాభం, రాజకీయ లాభం కోసం సీఎం ప్రజల ప్రాణాలు ఫణంగా పెడుతున్నారని విమర్శించారు.
తనకు కావాల్సిన ట్రావెల్స్ వారికి అన్ని పర్మిషన్లను సీఎం ఇప్పిస్తున్నారన్నారు. కాసుల కల్యాణ్, ప్యాకేజీ కల్యాణ్‌ను దించి సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓట్లేసిన వారికి న్యాయం చేయాలన్న ఆలోచన సీఎం చంద్రబాబు నాయుడుకుగానీ, ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్‌కుగానీ లేదన్నారు. కమీషన్లు, లంచాల కోసం ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టేవారిని తమపార్టీ వదలబోదని హెచ్చరించారు. ఐదుగురి మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.