ఢిల్లీ వెళ్లి తెలంగాణ రాష్ట్రంతో తిరిగొస్తా: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అనుమానాలు అవసరం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళుతున్నానని, తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగొస్తానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కబురు రాగానే సంబరాలు చేసుకుందామని చెప్పారు. పార్లమెంట్లో విభజన బిల్లు ఆమోదం పొంది తీరుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర, స్వయంపాలన ఆకాంక్ష త్వరలో నెరవేరబోతోందని వెల్లడించారు. ఇక నుంచి జరిగేదంతా ఢిల్లీలోనే అని చెప్పారు.
రాష్ట్రపతి అనుకుంటే శాసనసభను రద్దు చేయగలరని చెప్పారు. అసెంబ్లీ కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పగలుగుతుందన్నారు. ఉత్తరాంచల్ కోసం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పార్లమెంట్కే ఉందని ఉత్తరాంచల్ విషయంలో రుజువయిందన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు తమ స్థాయికి తగినట్టు మాట్లాడడం లేదని కేసీఆర్ విమర్శించారు. ఏం కావాలని కేంద్రం అడిగితే సీమాంధ్రలో ఒక్క నాయకుడు స్పందించలేదన్నారు.
మెజార్టీ అభిప్రాయం ఈ జన్మలో జరగదన్నారు. మెజార్టీ అభిప్రాయం అంటే దేశంలో కొత్త రాష్ట్రాలే ఏర్పడవన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో ఇబ్బందులు తలెత్తినప్పుడు పార్లమెంట్ పరిష్కరిస్తుందన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టేదే తుది బిల్లు అని కేసీఆర్ అన్నారు.