'రాష్ట్ర రాజకీయ నేపథ్యాన్ని తిరగ రాస్తా'
తిరుమల: దేవాదాయ మంత్రిగా పనిచేస్తే ఇక రాజకీయ భవిష్యత్ ఉండదన్న రాష్ట్ర రాజకీయ నేపథ్యాన్ని తిరగ రాస్తానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. దేవుడికి సేవ చేసే అవకాశం వచ్చిందని....కనుక భక్తులకు దేవుడిని మరింత దగ్గర చేస్తానని ఆయన తెలిపారు. 25000 ఎకరాల దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతమైపోయాయని, వాటన్నింటిని తిరిగి రప్పిస్తామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. అందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేసి విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు. తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రశాంతంగా దర్శనమయ్యేలా చేస్తానని సాక్షి టీవికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాణిక్యాలరావు స్పష్టం చేశారు.
కాగా కొన్ని శాఖలను తీసుకోవాలంటే మంత్రులే భయపడతారు. గతంలో ఆ శాఖలు తీసుకున్న మంత్రులు తరువాతి కాలంలో రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా చేసినవారు అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోవడం వంటి సందర్భాలున్నాయి. ఈ శాఖను తీసుకోవడానికి మంత్రులు అంతగా ఆసక్తి చూపరు. అయితే ఆ సెంటిమెంట్ను తిరగ రాస్తానని మంత్రి మాణిక్యాలరావు చెప్పటం విశేషం.